
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ లాంటి అన్ని కీలక సంస్థలు అభ్యంతరాలు తెలుపుతూ ప్రాజెక్టును తిరస్కరిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చడానికి అనుమతించరాదని, దానిని పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. అనుమతులిచ్చే రాజ్యాంగ సంస్థలను పట్టించుకోకుండా ఈ అంశాన్ని సమావేశంలో చర్చించడమంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమేనని తెలంగాణ పేర్కొంది. భవిష్యత్తులో చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఇది ఒక దారిగా మారుతుందన్న విషయాన్ని ప్రభుత్వం హెచ్చరించింది.
వివరాలు
ప్రాజెక్టును ఎజెండా నుంచి గోదావరి-బనకచర్ల అంశాన్ని తొలగించాలి
కేంద్ర జలశక్తి మంత్రి బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయగా, గోదావరి-బనకచర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చినట్లు సోమవారం కేంద్ర జలశక్తి కార్యదర్శి లేఖ రాశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టును ఎజెండా నుంచి తొలగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతిరామ్ కృష్ణారావు కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ పంపించారు. అంతర్ రాష్ట్ర జల సమస్యల చర్చ అవసరమైనప్పటికీ, ప్రస్తుత దశలో గోదావరి-బనకచర్ల అంశాన్ని చర్చలో పెట్టడం సరైంది కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటికే తమ అభిప్రాయాన్ని పలు దఫాలుగా వెల్లడించినట్లు చెప్పారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ అందించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టులో కీలక సమాచారం లేదు
భాగస్వామ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో చర్చించకుండానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, ఎపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ అందించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టులో కీలక సమాచారం లేదని తెలిపారు. నీటి లభ్యత, సాంకేతిక సాధ్యతలపై వివరాలు లేకపోయినందున, పర్యావరణ అనుమతిని నిపుణుల మదింపు కమిటీ తిరస్కరించిందని లేఖలో వివరించారు.
వివరాలు
తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిపై ప్రభావం:
బనకచర్ల ప్రతిపాదన వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వహణ పద్ధతి మారడమే కాకుండా, తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిపై ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు సమస్యలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇంకా పరిష్కారమయ్యకపోయిన పరిస్థితుల్లో, కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో మరో కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం సబబుకాదని పేర్కొన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు చెందిన వాటాను దెబ్బతీసేలా ఈ ప్రతిపాదన ఉందని వివరించారు. పోలవరం-బనకచర్ల ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సీడబ్ల్యూసీకి తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
వివరాలు
ముందుకెళ్లకుండా ఆపాలి
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను సమర్పించకుండా చూడాలని, టెండర్ల ప్రక్రియ సహా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. అన్ని అభ్యంతరాలు నివృత్తి అయ్యే వరకు ప్రాజెక్టుపై ఏ విధమైన చర్చలకు కూడా అవకాశం ఇవ్వకూడదని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
వివరాలు
పెండింగ్ అంశాలే లక్ష్యంగా..
కృష్ణా, గోదావరి నదీబేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొననుంది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గోదావరి-బనకచర్ల అంశాన్నిఎజెండా నుంచి తొలగించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత,కృష్ణా,గోదావరి నదీబేసిన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి మరో లేఖ పంపించారు. ఇందులో పాలమూరు-రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల పథకాలకుగాను నీటి కేటాయింపులతో పాటు పలు కీలక అంశాలు చర్చకు రావనున్నట్లు స్పష్టమైన సమాచారం అందింది.