LOADING...
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..!
వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..!

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

'వక్ఫ్‌ సవరణ బిల్లు-2024'పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తద్వారా, పార్లమెంట్‌లో రెండో దఫా బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ బిల్లుపై సమీక్షించిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈ నెల 13న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కమిటీ చైర్మన్‌గా జగదాంబికా పాల్‌, రాజ్యసభలో సభ్యురాలిగా మేధా విశ్రమ్‌ కుల్‌కర్ణి నివేదికను సమర్పించారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను నివేదిక నుంచి తొలగించారని వారు ఆరోపించారు.

వివరాలు 

భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడంపై అభ్యంతరం లేదు: అమిత్ షా  

నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వాకౌట్‌ చేశారు. అయితే భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడంపై తమకు అభ్యంతరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు నివేదికను ఉపసంహరించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఇది ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అయితే, నివేదికలో మార్పులు చేసే అధికారాన్ని కమిటీ చైర్మన్‌కు ఉంటుందని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మార్చి 10న ప్రారంభమయ్యే రెండో దఫా బడ్జెట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

వివరాలు 

15-11 మెజారిటీతో అనుమతి

జనవరి 29న జేపీసీ ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా నివేదికను ఆమోదించింది. 15-11 మెజారిటీతో దీనికి అనుమతి లభించింది. బీజేపీ సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను కమిటీ ఆమోదించగా, కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఆప్‌, శివసేన (యూబీటీ), ఏఐఎంఐఎంతో సహా విపక్ష పార్టీలు సూచించిన మార్పులను తిరస్కరించారు. కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి సభ్యుడిగా ఉంటారు. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్‌ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలను చేర్చాయి.

వివరాలు 

అసమ్మతి నోటును సమర్పించిన విపక్ష సభ్యులు

అలాగే, కుటుంబ వక్ఫ్‌ (వక్ఫ్‌ అలాల్‌ ఔలాద్‌)లలో మహిళలకు వారసత్వ హక్కులను పరిరక్షించే అంశాలను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంచారు. ఈ నివేదికపై విపక్ష సభ్యులు తమ అసమ్మతి నోటును సమర్పించారు. బీజేపీ ఈ బిల్లు వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సమర్థత పెంచేందుకు ఉద్దేశించినదని వాదించగా, ఇది ముస్లిం సమాజ హక్కుల్ని హరించేదిగా, వక్ఫ్‌ బోర్డుల పనితీరులో ప్రభుత్వ జోక్యంగా మారుతుందని విపక్షాలు విమర్శించాయి.