Page Loader
Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 
పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్

Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వీరిలో మొదటిగా ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేస్తున్న మొహమ్మద్‌ హరూన్‌ను నోయిడాలో అరెస్ట్ చేశారు. అతనికి పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయంలో పనిచేసే ముజమ్మిల్‌ హుస్సేన్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. హరూన్‌ విదేశీ వీసాల కోసం డబ్బులు సేకరించడం, సున్నితమైన సమాచారం పంచుకోవడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయి.

వివరాలు 

హరూన్‌కి పాకిస్థాన్‌లో బంధువులు

అధికారుల వివరాల ప్రకారం,ముజమ్మిల్‌ హుస్సేన్‌ పాక్‌ దౌత్య సిబ్బందిగా పనిచేస్తుండగా,హరూన్‌తో అతనికి దృఢమైన సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ తరచూ బలమైనసంబంధాల్లో ఉన్నారని గుర్తించారు. హరూన్‌కి పాకిస్థాన్‌లో బంధువులుండటం వల్ల ముజమ్మిల్‌ అతనికి పాక్‌ వీసాలు అందించే బాధ్యత తీసుకున్నాడని పేర్కొన్నారు. పాక్‌ వీసాలు ఇప్పిస్తానని చెబుతూ హరూన్‌ పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి, వాటిని వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తించారు. అందులో కొంత భాగాన్ని అతను తన కమిషన్‌గా తీసుకొని, మిగిలిన మొత్తాన్ని ముజమ్మిల్‌ సూచించిన వారికి ఇచ్చేవాడని ఏటీఎస్‌ తెలిపింది. హరూన్‌కి ముజమ్మిల్‌ పాక్‌ అధికారిగా ఉన్నాడన్న విషయం తెలిసినా సహకరించాడని అధికారులు వెల్లడించారు. అందువల్ల, అతను రహస్యమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

వివరాలు 

తుఫేల్‌ ని అరెస్ట్ చేసిన ఏటీఎస్‌ బృందం 

ఇటీవలే భారత ప్రభుత్వం ముజమ్మిల్‌ హుస్సేన్‌ను అనుమానిత వ్యక్తిగా గుర్తించి దేశ బహిష్కరణ చేసింది. ఇక మరో కేసులో, ఆదంపూర్‌, వారణాసీ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏటీఎస్‌ బృందం తుఫేల్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అనుసంధానమైన వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రూప్‌ను పాకిస్థాన్‌కు చెందిన సంస్థలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు, అతను పాక్‌కు సున్నితమైన సమాచారాన్ని కూడా చేరవేశాడని అధికారులు తెలిపారు.

వివరాలు 

యూపీలోని కొన్ని ప్రదేశాల ఫొటోల్ని పాకిస్థాన్‌లోని వ్యక్తులకు పంపిన తుఫేల్‌ 

తుఫేల్‌ పాక్‌కు చెందిన వ్యక్తులు,సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని గుర్తించారు. ప్రత్యేకంగా పాకిస్థాన్‌లో నిషేధించబడిన తెహ్రీక్‌ ఎ లబ్బేక్‌ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా షాద్‌ రిజ్వీ వీడియోలను తరచూ షేర్‌ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. గజ్వా-ఎ-హింద్‌కు సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించడం, భారత్‌లో షరియా చట్టాన్ని అమలు చేయాలన్న విషయాలపై ప్రచారం జరిపినట్లు ఏటీఎస్‌ వెల్లడించింది. తుఫేల్‌ వారణాసీలోని రాజ్‌ఘాట్‌,నమోఘాట్‌,జ్ఞానవాపీ మసీదు, వారణాసీ రైల్వేస్టేషన్‌, జామా మసీదు, ఎర్రకోట, నిజాముద్దీన్‌ వంటి ప్రదేశాల ఫొటోల్ని పాకిస్థాన్‌లోని వ్యక్తులకు పంపినట్టు గుర్తించారు.

వివరాలు 

పాక్‌లో దాదాపు 600 మందితో సంబంధాలు

అతనికి పాక్‌లో దాదాపు 600 మందితో సంబంధాలున్నట్లు సమాచారం. అంతేకాదు, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన నఫీస్ అనే మహిళతో కూడా తుఫేల్‌ సంభాషిస్తున్నాడని గుర్తించారు. ఆమె భర్త పాకిస్థాన్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ రెండు వేర్వేరు కేసులపై సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.