అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నాయకులతో కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కీలక పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన ఎటు వైపు ఉన్నాయనే విషయాన్ని రాహుల్ ఏపీ నేతలను అడిగారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, మినహా అధికార, విపక్షాలన్ని బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఏపీ నేతలు రాహుల్‌కు చెప్పారు.
త్వరలో అమరావతికి ప్రియాంక, విశాఖకు రాహుల్
అమవరాతి రాజధాని ప్రాంతంలో త్వరంలోనే ప్రియాంక గాంధీ పర్యటిస్తారని రాహుల్ గాంధీ ఏపీ నేతలతో చెప్పారు. విభజన చట్టంలోని ప్రతి హామీని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కూడా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని పోరాడుతున్న వారికి మద్దతు తెలిపేందుకు త్వరలోనే తాను వైజాగ్‌కు వస్తానని రాహుల్ ఏపీ నేతలకు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమన్నారు.