కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?
కర్ణాటకలో 1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పవర్ లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావించింది. ఇందుకోసం ఎంతో శ్రమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫోకస్ అంతా కర్ణాటక మీద పెట్టినా ఫలితం దక్కలేదు. చివరగా ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కంటే ఘోర పరాభవాన్ని బీజేపీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం.
లింగాయత్ ఫ్యాక్టర్
లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో ఒక ప్రముఖ హిందూ మతం. వీరు రాష్ట్ర జనాభాలో 17% పైగా ఉన్నారు. ఈ సంఘం కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. లింగాయత్‌లు రాష్ట్రంలో బీజేపీకి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి చేయడం, మాజీ సీఎం జగదీష్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదిలకు టిక్కెట్లు నిరాకరించడంతో లింగాయత్ కమ్యూనిటీలో బీజేపీ పట్ల వ్యతిరకేత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. 1980నుంచి యడియూరప్ప లింగాయత్ వర్గంతో మమేకమై ఉన్నారు. అందుకే బీజేపీ ఆయన్ను దూరం పెట్టడం ఆ కమ్యూనిటికి నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరికలు
ఎన్నికలకు ముందు లింగాయత్ నుంచి బీజేపీకి మరో సవాలు ఎదురైంది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి, మాజీ సీఎం, ఆరుసార్లు హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్, వీరిద్దరూ బీజేపీకి చెందిన ప్రముఖ లింగాయత్ నేతలు. ఈ ఇద్దరు కీలక లింగాయత్ నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో వారు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో బీజేపీ తమను అవమానించిందని వారు బహిరంగంగానే ప్రకటన చేయడం కాషాయ పార్టీకి మైనస్‌గా మారింది. ఇది బీజేపీకి వచ్చే లింగాయత్ ఓటు బ్యాంకుపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
నందిని-అమూల్ వివాదం
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జాతీయ సమస్యలను లేవనెత్తడం మానుకున్న కాంగ్రెస్, ఎన్నికలకు ముందు నందిని-అమూల్ వివాదానికి ఆజ్యం పోసింది. దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా మల్చుకుంది. స్థానిక పాల సహకార సంస్థ అయిన నందినికి రాష్ట్రంలోని పాడి రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే సమయంలో తెలివిగా గుజరాత్‌కు చెందిన అమూల్ పాల అంశాన్ని తెరపైకి తెచ్చి స్థానికంగా మద్దతును పొందడంలో విజయవంతమైంది. స్థానిక సమస్యలేవీ లేవనెత్తలేకపోయిన బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చరిష్మాపైనే ఎక్కువగా ఆధారపడింది. అయితే కాంగ్రెస్ మాత్రం స్థానిక నాయకులను ముందు పెట్టి ప్రచారం చేయడంతో పాటు లోకల్ సమస్యలపై దృష్టి సారించి, సత్తా చాటుకుంది.
సున్నితమైన అంశాలతో చిక్కుల్లో పడ్డ బీజేపీ
గత కొంతకాలంగా బీజేపీ కర్ణాటకలో చాలా సున్నితమైన అంశాలను లెవనెత్తుతోంది. అంతేకాకుండా వాటిని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించింది. తరగతి గదుల్లో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసాహారం, లౌడ్ స్పీకర్లలో ఆజాన్ వంటి అంశాలు గత ఏడాది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు బీజేపీ ప్రభుత్వం మత మార్పిడి, గోహత్య వ్యతిరేక బిల్లులను ఆమోదించింది. యూనిఫాం సివిల్ కోడ్, ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో చెప్పింది. హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలనే ఆశతో ముస్లింలకు 4% కోటాను కూడా రద్దు చేస్తామని చెప్పింది. ఇలాంటి చాలా సున్నితమైన అంశాలు బీజేపీకి కొన్ని వర్గాల ఓటు బ్యాంకు దూరమైనట్లు స్పష్టమవుతోంది.