Page Loader
#NewsBytesExplainer: బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను ఎందుకు రద్దు చేశారు?
బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను ఎందుకు రద్దు చేశారు?

#NewsBytesExplainer: బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను ఎందుకు రద్దు చేశారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోదావరి-బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ అనుమతుల రద్దుకు కారణమైన ఘనత తమదేనంటూ అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ, తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య నడుస్తున్న రాజకీయ మూడుముక్కలాట ఏంటో చూద్దాం.

వివరాలు 

బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఎందుకు రద్దు చేశారు? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టే ఉద్దేశంతో కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం అభ్యర్థనను సమర్పించింది. దీనిపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కొన్ని ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. గోదావరి జలాలపై ఉన్న వివాదాలను పరిష్కరించాల్సిన ట్రిబ్యునల్ తీర్పుకు ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని, ఇది అంతర్ రాష్ట్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. అలాగే కేంద్ర జల సంఘం (CWC) నుంచి అనుమతులేని పరిస్థితి, వరద జలాల అంచనాల లేవని ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత దశలో బనకచర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా చూపడం సాధ్యం కాదని తేల్చింది.

వివరాలు 

"ఇది మా ప్రభుత్వ పోరాట ఫలితం":కాంగ్రెస్ 

ఈ పరిణామం వెలుగులోకి రాగానే తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ - తమదే ఈ ఘనత అని చెప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అనుమతి తిరస్కరణ తమ ప్రభుత్వ కృషి ఫలితమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఈ అంశాన్నిచర్చించినందునే ఈ నిర్ణయం వచ్చిందని వారు స్పష్టం చేశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవని, ఆ సమయంలో కేసీఆర్ నోరు మెదపకపోవడం శోచనీయమని విమర్శించారు. ఏపీ తీరును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని, ఇది తమ విజయమని వారు గట్టిగా తెలిపారు.

వివరాలు 

"కాంగ్రెస్ మేం చేసిన పోరాటాన్ని హైజాక్ చేస్తోంది":బీఆర్ఎస్  

బీఆర్ఎస్ నేతలు బనకచర్ల అనుమతుల రద్దు తమ పార్టీ పోరాట ఫలితమంటూ, కాంగ్రెస్ పార్టీ దానిని తనదిగా చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఈ అనుమతుల తిరస్కరణ ఆంధ్ర ప్రభుత్వానికి గట్టి ఝలక్ అని, ఇది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ విజయమని స్పష్టం చేశారు. జనవరిలోనే ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆందోళన మొదలుపెట్టిందని, ఆ తర్వాతే కాంగ్రెస్ స్పందించిందని తెలిపారు. కల్వకుంట్ల కవిత కూడా స్పందిస్తూ, తెలంగాణ గోదావరి జలాలపై ఆంధ్రా చేస్తున్న దాడికి ఇది తగిన సమాధానమని, కేంద్రం పూర్తిగా ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సీఎం రేవంత్ తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

వివరాలు 

'కాంగ్రెస్, బీఆర్ఎస్ లవి నాటకాలు, అడ్డుకుంది కేంద్రమే': బీజేపీ 

ఇటు బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బనకచర్లను రాజకీయ డ్రామాల కోసం వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతూ, ఈ అనుమతుల తిరస్కరణ కేంద్రం విధించిన నిబంధనల ప్రకారమే జరిగిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ అంశాన్ని తమ తుపాకీకి తూటాలుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం ఎప్పుడూ రాష్ట్రాల మధ్య సమన్వయం పాటిస్తూ న్యాయం చేయాలని చూసేలా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

వివరాలు 

అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ

మొత్తానికి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం అనుమతులు నిరాకరించడాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయి. ఈ ఘనత తమదంటూ పరస్పరం మాటల యుద్ధం సాగించుకుంటున్నాయి. మరోవైపు, అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.