Holi 2026: రంగుల హోలీకి రాష్ట్రాల వారీగా ప్రత్యేక సంప్రదాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ అనేది రంగుల సంబరంగా గుర్తింపు పొందిన పండుగ. చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడే ఉత్సవం ఇది. కులం, మతం అనే భేదాలు లేకుండా జరుపుకునే ప్రత్యేక పర్వదినం కావడంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొంటారు. మన దేశంలోనే కాకుండా పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లలో కూడా హోలీ ఉత్సాహంగా జరుగుతుంది. విదేశాల్లో, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎక్కువగా నివసించే అమెరికాలో కూడా ఈ పండుగ రంగురంగుల వాతావరణంలో నిర్వహిస్తారు. ఇక భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని ఎలా జరుపుకుంటారో చూద్దాం.
వివరాలు
బిహార్‌లో:
ఫాల్గుణ పౌర్ణమికి ముందురోజు బిహార్ ప్రజలు భారీ మంటలు వెలిగించడం ఆనవాయితీ. ఈ మంటల కోసం పిడకలు,ఆరాడ్, హోలీకలపతో పాటు పంట కోత తర్వాత మిగిలే పొట్టు వంటి వాటిని ఉపయోగిస్తారు. పండుగ రోజు జానపద గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహిస్తారు. పంజాబ్‌లో: పంజాబ్‌లో సిక్కులు కూడా హోలీని వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను"హోలా మొహల్లా" అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా పేరుపొందిన హోలా మొహల్లా వేడుకలు ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బర్చానా ప్రాంతం హోలీకి ప్రసిద్ధి గాంచింది. అక్కడ రాధారాణి ఆలయంలో "లాఠ్ మార్ హోలీ"అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది సమక్షంలో మహిళలు పురుషులను కర్రలతో కొట్టే సంప్రదాయం ఉంది.
వివరాలు
ఒడిశాలో:
ఒడిశా ప్రజలు కూడా హోలీని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇతర ప్రాంతాల్లా శ్రీకృష్ణుడు, రాధా విగ్రహాలను కాకుండా పూరీలోని జగన్నాథుడి విగ్రహాలను పూజించడం ఇక్కడి ప్రత్యేకత. పశ్చిమ బెంగాల్‌లో: పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన పట్టణాల్లో శ్రీకృష్ణుడు, రాధా విగ్రహాలను అందంగా అలంకరించి పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. మహిళలు నృత్యాలు చేస్తుండగా భక్తులు చుట్టూ తిరుగుతూ కీర్తనలు పాడుతారు. పండుగ సందర్భంగా మల్పోయే, కీర్ సందేష్, బాసంతి సందేష్ వంటి సంప్రదాయ మిఠాయిలు తయారు చేస్తారు.
వివరాలు
గుజరాత్‌లో:
గుజరాత్‌లో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి. కాలనీలు, వీధుల్లో మంటలు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేస్తే చెడు దూరమవుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. అదేవిధంగా మథుర, బృందావన్ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హోలీ ముగింపు వరకు పదహారు రోజుల పాటు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. అహ్మదాబాద్‌లో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒక ప్రత్యేక ఆచారం ఉంది. మజ్జిగతో నింపిన కుండను వీధిలో ఎత్తుగా కట్టుతారు. యువకులు దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో యువతులు వారిపై నీళ్లు చల్లి ఆటపట్టిస్తారు. రంగులు తగలకుండా జాగ్రత్తపడేవారిని సరదాగా ఎగతాళి చేస్తూ రంగులతో తడిసినవారిని ఊరేగిస్తారు. చివరకు కుండను పగులగొట్టిన వ్యక్తిని "హోలీ రాజు"గా ప్రకటించి కిరీటం ధరిస్తారు.
వివరాలు
మణిపూర్‌లో:
మణిపూర్‌లో హోలీ ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. యువకులు తెలుపు, పసుపు రంగుల తలపాగాలు ధరిస్తారు. రాత్రి సమయంలో "తాబల్ చోంగ్బా" అనే జానపద నృత్యాన్ని నిర్వహిస్తారు. అలాగే "గులాల్" ఆటలో పాల్గొనాలని అమ్మాయిలను ఆహ్వానిస్తూ అబ్బాయిలు డబ్బులు ఇవ్వడం కూడా అక్కడి సంప్రదాయం. మహారాష్ట్రలో: మహారాష్ట్రలో హోలీని "షింగా" అని పిలుస్తారు. పండుగకు వారం ముందే యువకులు కట్టెలను సేకరించి ఇళ్ల ముందు పోగు చేస్తారు. హోలీ రోజు సాయంత్రం వాటిని ఒకచోట చేర్చి మంటలు వెలిగిస్తారు. ఈ సందర్భంగా "పూరణ్ పోలీ" అనే ప్రసిద్ధ తీపి వంటకం తయారు చేస్తారు.