Page Loader
వరల్డ్ ఆస్టరాయిడ్ డే ఎందుకు జరుపుతారు? దాని వెనక చరిత్ర ఏంటి? 
వరల్డ్ ఆస్టరాయిడ్ డే

వరల్డ్ ఆస్టరాయిడ్ డే ఎందుకు జరుపుతారు? దాని వెనక చరిత్ర ఏంటి? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 30, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ సంవత్సరం జూన్ 30వ తేదీన ప్రపంచ గ్రహశకలాల దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో రష్యాలోని సెంట్రల్ సైబీరియాలో గ్రహశకలం భూమిపై పడింది. ఈ గ్రహశకలం కారణంగా 2000చదరపు కి.మీటర్ల(5లక్షల ఎకరాలు) పైన్ అడవి నాశనం అయ్యింది. ఈ ఈవెంటును తుంగుస్కా ఈవెంట్ అంటారు. అలాగే 2013 ఫిబ్రవరి 15వ తేదీన రష్యాలో సెకనుకుకు 18.6కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గ్రహశకలం, చెల్యాబిన్స్ మీదుగా ఆకాశంలో పేలిపోయింది. ఈ రెండు సంఘటనల కారణంగా, 2014లో స్టీఫెన్ హాకింగ్, రస్టీ స్వీకార్ట్, బ్రియాన్ మే అనే ముగ్గురు శాస్త్రవేత్తలు వరల్డ్ ఆస్టరాయిడే డే జరపాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2016లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, జూన్ 30వ తేదీన ఆస్టరాయిడ్ డే జరుపుకోవాలని ప్రకటించింది.

Details

వరల్డ్ ఆస్టరాయిడ్ డే జరపడానికి కారణాలు 

భూమిపై గ్రహశకలాలు చూపించే ప్రభావాన్ని అర్థం చేయించడానికి, అందరిలో అవగాహన కలిగించి, భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల కలిగే విపత్తుల నుండి బయటపడటానికి ఏం చేయాలనే విషయంలో పరిశోధనలు జరపడానికి ఈరోజును జరుపుతారు. గ్రహశకలాలు అంటే: సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను గ్రహశకలాలు అంటారు. వీటిని నిర్దిష్టమైన ఆకారం ఉండదు. ఇవి గ్రహాల కంటే చిన్నగా ఉంటాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏ రెండు గ్రహశకలాలు కూడా ఒకే ఆకారంలో ఉండవు. సౌరకుటుంబంలో గ్రహశకలాలు ఎక్కువ శాతం అంగారక, బృహస్పతి మధ్యలో ఉంటాయి. గ్రహశకలాలు పడటం వల్లే భూమి మీద డైనోసార్లు అంతరించిపోయాయని చెప్పుకుంటారు.