Page Loader
Apple: రికార్డు స్థాయిలో భారత్‌లో ఆపిల్ విక్రయాలు: కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ 
రికార్డు స్థాయిలో భారత్‌లో ఆపిల్ విక్రయాలు: కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌

Apple: రికార్డు స్థాయిలో భారత్‌లో ఆపిల్ విక్రయాలు: కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ఆపిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ శుక్రవారం ప్రకటించారు. అతను ఈ సందర్బంగా భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌గా ఐఫోన్‌ నిలిచిందని తెలిపారు. అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసికంలో ఐఫోన్‌ రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు టిమ్‌ కుక్‌ చెప్పారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, పీసీలు, ట్యాబ్లెట్లలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా యాపిల్‌ నిలిచిందన్నారు. భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌గా ఐఫోన్‌ నిలవడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు.

వివరాలు 

కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం ఆపిల్ 23 శాతంతో మార్కెట్‌ వాటా

భారత్‌తో పాటు, అమెరికా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాల్లో కూడా ఈ సంస్థ విక్రయాలు పెరిగాయని కుక్‌ వివరించారు. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం, 2024లో విలువ ఆధారంగా యాపిల్‌ 23 శాతం, శాంసంగ్‌ 22 శాతం మార్కెట్‌ వాటాతో కొనసాగాయి. వివో (16 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (9 శాతం) వాటాలతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. యాపిల్‌ భారతదేశంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు టిమ్‌ కుక్‌ తెలిపారు. అలాగే, యాపిల్‌ తన ఇంటెలిజెన్స్‌ను ఇంగ్లీష్‌తో పాటు మరిన్ని భాషలకు మద్దతు ఇచ్చేలా తీసుకువస్తామని చెప్పారు. భారత్‌లో ఎంటర్‌ప్రైజ్‌ విభాగం నుండి యాపిల్‌కు బలమైన డిమాండ్‌ ఉందని ఆయన వెల్లడించారు.

వివరాలు 

నాలుగు స్టోర్లను ప్రారంభించే ప్రయత్నం

ఇదిలాఉండగా, 2023 ఏప్రిల్‌లోనే దిల్లీ, ముంబయిలో రెండు రిటైల్‌ స్టోర్లను ప్రారంభించిన యాపిల్‌, వీటి ఆదరణతో విస్తరణ పై దృష్టి పెట్టింది. త్వరలోనే బెంగళూరు, పుణె, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయిలో మరో నాలుగు స్టోర్లను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.