Page Loader
SpaDeX: స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో 
స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో

SpaDeX: స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాలలో మరో కీలక అడుగు వేసింది. ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే ప్రత్యేక మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. తాజాగా, ఈ ప్రాజెక్టులో రెండో డాకింగ్‌ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. PSLV-C60/SpaDeX మిషన్‌లో భాగంగా ఈ రెండో డాకింగ్‌ ప్రక్రియ సోమవారం జరిగింది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ 'ఎక్స్‌'లో తెలియజేశారు.

వివరాలు 

రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం

''రెండవ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్టు ప్రకటించేందుకు ఆనందంగా ఉంది. గత ఏడాది డిసెంబర్‌ 30న PSLV-C60/SpaDeX మిషన్‌ను ప్రయోగించాం. అనంతరం ఈ ఏడాది జనవరి 16న తొలిసారిగా ఉపగ్రహాల మధ్య అనుసంధానం విజయవంతంగా సాగింది. ఆపై మార్చి 13న వాటిని అన్‌డాక్‌ చేశాం. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాం'' అని మంత్రి వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జితేంద్ర సింగ్‌  చేసిన ట్వీట్ 

వివరాలు 

స్పేస్‌ డీ-డాకింగ్‌ విజయవంతం

మార్చి 13న ఇస్రో తన స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా స్పేస్‌ డీ-డాకింగ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతరిక్ష నౌకలు స్వయంగా అనుసంధానమవ్వగల సామర్థ్యం సాధించడంలో ఇది కీలకమైన దశ. భూమిపై ఉన్న నియంత్రణ వ్యవస్థలపై ఆధారపడకుండా, భవిష్యత్తులో చంద్రయాన్‌ 4 లాంటి అంతరిక్ష మిషన్లకు ఇది అత్యంత ఉపయోగపడుతుంది. మానవ సహిత అంతరిక్ష ప్రయాణాల లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఇస్రోకు ఈ సాంకేతికత చాలా కీలకంగా మారుతుంది.

వివరాలు 

ప్రపంచంలోని నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు

ఈ SpaDeX మిషన్‌లో భాగంగా ఇస్రో నింగిలోనే ఉపగ్రహాల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌ 30న ఛేజర్‌ మరియు టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనేక ప్రయత్నాల అనంతరం జనవరి 16న ఈ ఉపగ్రహాల మధ్య డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.