OpenAI: 'స్టార్‌గేట్' కోసం దిగ్గజ డేటా సంస్థలతో ఓపెన్ ఏఐ చర్చలు..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రస్తుతం భారత్‌లోని వివిధ డేటా సెంటర్ కంపెనీలతో మంతనాలు ప్రారంభించింది. ఈ చర్చల్లో సిఫి టెక్నాలజీస్, యట్టా డేటా సర్వీసెస్, ఈ2ఈ నెట్‌వర్క్స్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ వంటి సంస్థలు భాగంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా స్థాపించిన గ్లోబల్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ 'స్టార్‌గేట్'ను భారత్‌లో అమలు చేయడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇక, ఓపెన్‌ఏఐ గత ఆరు నెలలుగా చమురు,టెలికాం రంగంలో ప్రధాన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కూడా సమగ్ర చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఓపెన్‌ఏఐ ప్రకటించింది. రిలయన్స్ ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది.
వివరాలు
దేశంలోకి స్టార్‌గేట్ ప్రాజెక్ట్
అయితే, ఇప్పటివరకు రిలయన్స్, ఓపెన్‌ఏఐ ఏ విధమైన బహిరంగ ప్రకటనలు చేయలేదు. ప్రస్తుత చర్చల్లో ప్రధానంగా డేటా సెంటర్ల ఏర్పాటు, వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా, ఇతర వనరుల లభ్యత వంటి అంశాలను చర్చించుకుంటున్నారు. భారత ప్రభుత్వం కొంతకాలం క్రితం స్టార్‌గేట్ ప్రాజెక్ట్‌ను దేశంలోకి తీసుకురావాలని ఓపెన్‌ఏఐతో అభ్యర్థించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం భారతీయుల డేటాను దేశీయ భద్రతా ప్రమాణాల ప్రకారం స్థానికంగా నిల్వ చేయడం. తాజాగా ఈ ప్రాజెక్ట్ అమలు కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వం కూడా దీనిలో కొన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి అందించే అవకాశం ఉంది.
వివరాలు
ఓపెన్‌ఏఐకి కీలకమైన మార్కెట్‌గా భారత్
భారత దేశం ఓపెన్‌ఏఐకి కీలకమైన మార్కెట్‌గా మారిపోతోంది. భవిష్యత్తులో అత్యధిక ఆదాయం కూడా ఇక్కడే వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో స్టార్‌గేట్ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యమైన కార్యకలాపాలను భారత్‌లోనే నిర్వహించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ కూడా ప్రజల డేటాను నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం వంటి కార్యకలాపాలను దేశీయ స్థాయిలో చేయనుంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఏడబ్ల్యూఎస్ వంటి ప్రముఖ కంపెనీలు భారత్‌లో భారీ డేటా సెంటర్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో కొన్ని సెంటర్లు విస్తరిస్తూ, సేవల నాణ్యతను పెంచుతూ, లేటెన్సీ తగ్గిస్తున్నాయి.
వివరాలు
డేటాను అక్కడే స్టోర్ చేసే ప్రక్రియ మొదలు
గత నెలలో ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) మాట్లాడుతూ.. "అమెరికా తరువాత భారత్ మా కంపెనీకి అతిపెద్ద మార్కెట్. ఇక్కడ మా వ్యాపారం వేగంగా పెరుగుతోంది" అని పేర్కొన్నారు. ఇప్పటికే న్యూదిల్లీలో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేస్తూ, స్థానిక ఉద్యోగ నియామకాలను మొదలుపెట్టారు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచడానికి ధరలను భారత కరెన్సీలోకి మార్చారు. అదేవిధంగా, ఓపెన్‌ఏఐ ముఖ్య ఆసియా దేశాల్లో వినియోగదారుల డేటాను స్థానికంగా నిల్వ చేయడం ప్రక్రియను మే నెల నుండి ప్రారంభించింది.