Page Loader
Stargate: సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ జాయింట్‌గా 500 బిలియన్ డాలర్ల అతిపెద్ద AI ప్రాజెక్ట్
సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ జాయింట్‌గా 500 బిలియన్ డాలర్ల అతిపెద్ద AI ప్రాజెక్ట్

Stargate: సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ జాయింట్‌గా 500 బిలియన్ డాలర్ల అతిపెద్ద AI ప్రాజెక్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ క్షణం నుంచే అమెరికా స్వర్ణయుగం ఆరంభమైందని దేశాధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ విలువ 500 బిలియన్ డాలర్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేస్తున్న ఓపెన్ఏఐ, ఒరాకిల్‌తో పాటు జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు "స్టార్ గేట్" అని పేరు పెట్టారు డొనాల్డ్ ట్రంప్.

వివరాలు 

సాంకేతిక సహకారం

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మైక్రోసాఫ్ట్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎంజీఎక్స్, చిప్ తయారీ రంగంలో పేరు పొందిన ఎన్‌విడియా కూడా పనిచేస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారం అందజేస్తాయి. ప్రాజెక్ట్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలను అమెరికా ప్రభుత్వం అందజేస్తూ భాగస్వామిగా ఉంటుంది. వైట్ హౌస్‌లో ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌లతో డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. స్టార్ గేట్ ప్రాజెక్ట్‌కు అవసరమైన మౌలిక వనరులు, ఆర్థిక సహకారం, విస్తరణపై వీరు చర్చించారు. అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వివరాలు 

తొలి దశలో 19 బిలియన్ డాలర్ల పెట్టుబడి

ఈ ప్రాజెక్ట్ టెక్సాస్‌లో ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్లను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని చేపడతారు. మొత్తం ఐదు దశల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ ప్రాజెక్ట్‌లో పెట్టనున్నారు. తొలి దశలో సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ సంయుక్తంగా 19 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన నిపుణులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో, అనుబంధ సంస్థల అభివృద్ధి ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్టవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.