Page Loader
IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
09:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) అద్భుత శతకంతో విజృంభించాడు. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిలిపింది. అభిషేక్‌తో పాటు శివమ్ దూబే (30; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు తీసుకున్నాడు, మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Details

శుభారంభం అందించిన భారత ఓపెనర్లు

జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో సంజు శాంసన్ (16; 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాది చెలరేగాడు. అయితే రెండో ఓవర్ చివరి బంతికి మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో భారత్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఓ ఫోర్, రెండు సిక్సర్లు బాది తన దూకుడును ప్రదర్శించాడు. ఆపై ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Details

17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి

17 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్న అభిషేక్, ఆ తర్వాత మరింత వేగాన్ని పెంచాడు.మరోవైపు తిలక్ వర్మ అతనికి చక్కని సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 95/1 స్కోరుతో నిలిచింది. ఇక టీ20ల్లో భారత జట్టు సాధించిన అత్యధిక పవర్‌ప్లే స్కోరు ఇదే. ఆ తర్వాత తిలక్ వర్మ, అభిషేక్ శర్మ జోడీ రెండో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే, వేగంగా ఆడే క్రమంలో తిలక్, కార్సే బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2) మరోసారి విఫలమయ్యాడు. అయినా ఐదో స్థానంలో వచ్చిన శివమ్ దూబే అద్భుతంగా ఆడి అభిషేక్‌తో కలిసి విజృంభించాడు.

Details

రాణించిన దూబే

ఈ క్రమంలో అభిషేక్ శర్మ 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. సెంచరీ అనంతరం మరింత ధాటిగా ఆడే క్రమంలో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ క్యాచ్ అందుకోవడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. దూబే అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (6), రింకూ సింగ్ (9), అక్షర్ పటేల్ (15) పెద్దగా రాణించలేకపోయారు. దీంతో భారత జట్టు 250 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజృంభించిన అభిషేక్ శర్మ