Champions Trophy 2025: రోహిత్ శర్మకు మరో అవకాశం.. ఛాంపియన్ ట్రోఫీకి కెప్టెన్‌గా కొనసాగించనున్న బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది.
అదే సమయంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును కూడా ప్రకటించాల్సి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆడే చివరి వన్డే సిరీస్ కూడా ఇంగ్లండ్‌తోనే జరుగుతుందన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక అవుతారా? లేక హార్దిక్ పాండ్యాకు సారథ్యం అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
Details
ఇంగ్లండ్ సిరీస్ లో కూడా రోహిత్ కు ఛాన్స్
అయితే బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ నాయకత్వంలోనే భారత జట్టు బరిలో దిగతుందని, అతడిని ఇంగ్లండ్ సిరీస్‌కూ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇది చివరి ఐసీసీ టోర్నీ కావచ్చని భావిస్తున్నారు. భారత జట్టు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ కూడా అంతగా మెరవడంలేదు.
ఆసీస్ సిరీస్‌లో తన స్థాయి ఆటను కనబర్చలేకపోయాడు. దీంతో రోహిత్, విరాట్ టెస్టులకు గుడ్‌బై చెబుతారనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు వారు అలాంటి ప్రకటన చేయలేదు.
Details
తిరిగి జట్టులోకి మహ్మద్ షమీ
మరోవైపు, వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి విరాట్ కోహ్లీకి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
గత వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్, టెస్టు ఫామ్ పక్కనపెడితే, వన్డేల్లో ఆడగల సామర్థ్యం ఉందని సెలక్టర్లు విశ్వసిస్తున్నారు.
ఇక మోకాలి వాపు కారణంగా ఆసీస్ సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ షమీ ఆటను ఆశిస్తున్నారు.
Details
రిషబ్ పంత్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం
ఇతర పేసర్ల విషయానికి వస్తే, బుమ్రా ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది.
వెన్ను నొప్పి కారణంగా అతడి ఛాంపియన్స్ ట్రోఫీ పాల్గొనడం అనిశ్చితంగా మారింది.ఒకవేళ బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తే, భారత పేస్ దళం మరింత పటిష్టంగా మారుతుంది.
మరోవైపు ఇంగ్లండ్ సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి.
అయితే సంజూ శాంసన్ తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది. భారత జట్టు సెలక్షన్ ప్రక్రియ జనవరి 12 లోపు పూర్తవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.