Page Loader
Dilip: భారత పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను తిరిగి నియమించిన బిసిసిఐ
భారత పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను తిరిగి నియమించిన బిసిసిఐ

Dilip: భారత పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను తిరిగి నియమించిన బిసిసిఐ

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్‌ మరోసారి ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్‌ పర్యటనను దృష్టిలో పెట్టుకుని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్‌ను మళ్లీ ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది. 2021లో ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దిలీప్‌, ఈ ఏడాది ప్రారంభం వరకూ టీమిండియాతో కొనసాగారు. అయితే, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సమయంలో జట్టు ఫీల్డింగ్‌ విభాగం తృప్తికరంగా లేకపోవడంతో సహాయ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో పాటు దిలీప్‌ను కూడా తప్పించారు. దిలీప్‌కు బదులుగా ఓ విదేశీ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ యత్నించినా, అది సాధ్యపడలేదు.

వివరాలు 

జూన్‌ 20 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌

దీంతో భారత జట్టులోని ఆటగాళ్లతో బలమైన అనుబంధం ఉన్న దిలీప్‌ను తిరిగి బాధ్యతలకు నియమించాలని నిర్ణయించింది. "దిలీప్‌ అనుభవం కలిగిన శ్రేష్ఠమైన కోచ్‌. గత నాలుగేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేస్తూ ఆటగాళ్ల శక్తి, బలహీనతలను బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌కు ముందు అతడిని తిరిగి నియమించాం," అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక మరోవైపు, భారత టెస్టు జట్టుకు కొత్తగా కెప్టెన్‌గా ఎంపికైన శుభమన్‌ గిల్‌తో పాటు సుదర్శన్‌ కూడా జూన్‌ 6 నుంచి ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుతో జరగనున్న వార్మప్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ జూన్‌ 20 నుంచి మొదలుకానుంది.