LOADING...
IND vs ENG: నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఆఖరి టెస్టు.. సమం చేస్తారా? 
నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఆఖరి టెస్టు.. సమం చేస్తారా?

IND vs ENG: నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఆఖరి టెస్టు.. సమం చేస్తారా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటనలో చివరి మ్యాచ్‌కు వేళైంది. గురువారం ప్రారంభమయ్యే ఐదో టెస్టులో భారత్‌ - ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. మొదటి, మూడో టెస్టుల్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా,రెండో టెస్టులో నెగ్గిన భారత జట్టు అసాధారణ పోరాటంతో నాలుగో టెస్టును డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఆ డ్రా ఇచ్చిన ఉత్సాహంతో గిల్‌సేన బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బగా స్టోక్స్ గైర్హాజరు కావడం,జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతి ఇవ్వడం వల్ల భారత్‌కు అవకాశాలు మెరుగయ్యాయని చెప్పొచ్చు. అలాగే ఓవల్ క్యురేటర్‌తో భారత కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా మ్యాచ్‌కు మరింత ఆసక్తి పెరిగింది.

వివరాలు 

ఆత్మవిశ్వాసంతో గిల్ సేన 

మాంచెస్టర్‌లో ఓటమి అనివార్యమని అనుకున్న పరిస్థితుల్లోనూ భారత్ మ్యాచ్‌ను డ్రాగా మలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో స్కోరు ప్రారంభించేలోపే రెండు వికెట్లు కోల్పోయినా, జట్టు 143 ఓవర్ల పాటు ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ దళాన్ని తట్టుకుని నిలిచింది. ఈ పట్టుదల ఐదో టెస్టులోనూ కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.శుభమన్ గిల్ (722 పరుగులతో టాప్ స్కోరర్),కేఎల్ రాహుల్ (511 పరుగులతో రెండో స్థానంలో) ఫామ్‌లో ఉన్నారు. వీళ్లు పరుగుల వేటను కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా,వాషింగ్టన్ సుందర్ గత మ్యాచ్‌లో బాగా రాణించడంతో జట్టు వీరి ప్రదర్శన పునరావృతం కావాలని ఆశిస్తోంది. సాయి సుదర్శన్‌కు మరో అవకాశం దక్కనుండగా,అతడితో పాటు యశస్వి జైస్వాల్ రాణించాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

బౌలింగ్ విభాగంలో మార్పులు 

పంత్ గాయంతో దూరమైన నేపథ్యంలో,వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలిసారి ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. అతను 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నారు. ఎనిమిదో స్థానానికి వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండాలన్న ఉద్దేశంతో, ఇప్పటికే ఇద్దరు స్పిన్నర్లు ఉన్నందున కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్‌ల్లో రాణించకపోవడంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా ఐదో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనిభార నిర్వహణ కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వనున్నారు.బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మహ్మద్ సిరాజ్ పేస్ దళానికి నాయకత్వం వహించనుండగా,ప్రసిద్ధ్‌ కృష్ణ తిరిగి జట్టులోకి రావచ్చు.

వివరాలు 

ఇంగ్లాండ్‌కు దెబ్బ:

ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయంతో ఐదో టెస్టుకు దూరమయ్యాడు.గత రెండు టెస్టుల్లోనూ ఆటగాడిగా మాత్రమే కాకుండా "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"గా నిలిచిన స్టోక్స్ ఈ సిరీస్‌లో 304 పరుగులు, 17 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు ఆధిక్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి స్థానంలో ఒలీ పోప్ కెప్టెన్సీ చేయనున్నారు.అయితే స్టోక్స్‌ వంటి ఆల్‌రౌండర్‌ గైర్హాజరుతో ఇంగ్లాండ్‌కు సవాళ్లు ఎదురవుతాయి. ఇంకా జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతి ఇవ్వడమే కాక,బ్రైడన్ కార్స్,లియామ్ డాసన్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు. అంటే ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ జట్టులో పలు మార్పులు చోటుచేసుకుంటాయి.

వివరాలు 

బ్యాటింగ్ ఫార్మ్ ఇంగ్లాండ్‌కు బలం 

ముఖ్యంగా, ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. ఓవల్ పిచ్‌ను బాగా తెలుసుకున్న పేసర్లు అట్కిన్సన్, ఓవర్టన్ తుది జట్టులోకి చేరారు. వీరు వోక్స్, జోష్ టంగ్‌లతో కలిసి పేస్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లకు ఎంపికైన ఏకైక బౌలర్ వోక్స్ మాత్రమే. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ టాప్‌-3లో క్రాలీ, డకెట్, పోప్‌లతో బలంగా ఉంది. నాల్గో టెస్టులో టాప్‌-4 బ్యాటర్లు అందరూ రాణించారు. జో రూట్‌ గత మ్యాచ్‌లో భారీ సెంచరీ (150)తో మెరిశాడు. మొత్తం సిరీస్‌లో అతడు 67.16 సగటుతో 403 పరుగులు చేశాడు. దీని వల్ల ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ విభాగంలో స్టెబిలిటీ ఉంది. అదనంగా ధాటిగా ఆడే బెతెల్ జట్టులోకి వచ్చాడు.

వివరాలు 

ఓవల్ పిచ్..వాతావరణం 

ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇటీవల జరిగిన కౌంటీ మ్యాచ్‌లో ఇక్కడ రెండూ ఇన్నింగ్స్‌లలో కలిపి 1500కి పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 343 పరుగులు. అయితే మ్యాచ్‌ సందర్భంగా వర్షం పడితే పిచ్‌ స్పందించే తీరులో మార్పు రావొచ్చు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ మ్యాచ్‌లో వర్షం ఆటకు అంతరాయం కలిగించొచ్చనే అంచనాలు ఉన్నాయి. గురువారం మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం తేలికపాటి జల్లులు పడొచ్చు. శుక్రవారం, శనివారం రోజుల్లోనూ వర్షాభావ సూచనలు ఉన్నాయి.

వివరాలు 

తుది జట్లు 

ఇంగ్లాండ్‌: క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, బ్రూక్, జాకబ్‌ బెతెల్, జేమీ స్మిత్, వోక్స్, అట్కిన్సన్, టంగ్, ఒవర్టన్‌. భారత్‌ (అంచనా): జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్, జడేజా, ధ్రువ్‌ జురెల్, సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌/అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్, సిరాజ్‌.

వివరాలు 

ఓవల్‌లో భారత్ రికార్డు 

ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 15 టెస్టులు ఆడింది. వాటిలో 2 విజయాలు, 6 ఓటములు, 7 డ్రాలు చోటు చేసుకున్నాయి. చివరిసారి భారత్ ఈ మైదానంలో 2023 టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. 21వ శతాబ్దంలో ఇప్పటి వరకు 26 అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు జరిగాయి. వాటిలో కేవలం 3 సిరీస్‌ల్లో మాత్రమే అన్ని మ్యాచ్‌లు ఐదో రోజు వరకు వెళ్లాయి. ప్రస్తుత సిరీస్‌లో జరగిన నాలుగు మ్యాచ్‌లు అన్నీ ఐదో రోజు వరకూ సాగాయి. దీంతో ఐదో టెస్టుపై భారీ ఆసక్తి నెలకొంది.