ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన గిల్, తిలక్ వర్మ.. అగ్రస్థానంలో సూర్యకుమార్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా యువ క్రికెటర్లు మెరుగ్గా రాణించడంతో ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాలను సంపాదించారు. టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 907 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ ఏకంగా 43 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకులో నిలిచాడు. టాప్-10 లో సూర్యకుమార్ యాదవ్ మినహా ఇతర భారత క్రికెటర్లు లేకపోవడం గమనార్హం. ఇక విండీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తిలక్ వర్మ 509 పాయింట్లతో 46వ స్థానంలో ఉన్నారు. యశస్వీ జైస్వాల్ 395 పాయింట్లతో 88వ ర్యాంక్ ను సాధించారు.
టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా
బౌలింగ్ జాబితాలో టాప్-10 లో ఒక్క టీమిండియా ఆటగాడు లేకపోవడం శోచనీయం. ఆల్ రౌండర్ లిస్టులో మాత్రం హార్ధిక్ పాండ్యా 250 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వన్డే ఫార్మాట్లో శుభ్ మాన్ గిల్ 743 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 705 పాయింట్లతో 9వ స్థానంలో నిలవడం విశేషం. వన్డే బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ 670 పాయింట్లతో నాలుగో స్థానం, కుల్దీప్ యాదవ్ 622 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీ20ల్లో భారత్ స్థానం మారలేదు. విండీస్ తో వన్డే సిరీస్ ఓడిపోయినప్పటికీ 264 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.