Champions Trophy 2025: నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ.. రోహిత్ సేనకు అంత ఈజీ కాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ దశ ప్రారంభమైంది. తొలి సెమీఫైనల్‌లో అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. లీగ్ దశలో మూడు విజయాలతో దూసుకెళ్లిన రోహిత్ శర్మ సేనకు సెమీఫైనల్ సవాల్ అంత తేలిక కాదు.
ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశకు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా మామూలుగా ఉండదు.
అయితే, దుబాయ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, అలాగే స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్ టీమిండియాకు ఉపయోగపడే అంశాలు.
అయినప్పటికీ, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ కారణంగా ఆసీస్ కొంత బలహీనంగా కనిపించినా వారిని తక్కువ అంచనా వేయలేం.
వివరాలు
భారత బ్యాటింగ్ ఫామ్
ఓపెనర్ శుభమన్ గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ మాత్రం సెమీఫైనల్‌లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడతాడేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై సెంచరీ చేసి తన సత్తా చాటినట్లు, ఈ కీలక మ్యాచ్‌లోనూ మరో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతుండటం పాజిటివ్ అంశం. అక్షర్ పటేల్ ప్రమోషన్‌ను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు.
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు.
వివరాలు
భారత బౌలింగ్
స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు, కనుక పేసర్లపై పూర్తి ఆధారపడాల్సిన అవసరం లేదు.
సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ, ఆసీస్‌పై ఆరంభంలో వికెట్లు తీయడం కీలకం. హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు.
అయితే, రిషబ్ పంత్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడతాడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
ఆస్ట్రేలియా పరిస్థితి
ఆఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లతో ఆస్ట్రేలియా ఆడాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
కానీ,ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 352 పరుగుల భారీ ఛేదనతో అద్భుత విజయం సాధించింది.
గాయాల కారణంగా కమిన్స్, హేజిల్‌వుడ్,స్టార్క్,మార్ష్ దూరం కావడం కంగారూలకు ఎదురుదెబ్బ.
అయినప్పటికీ,వారిని తక్కువగా అంచనా వేయడం పొరపాటే.మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కనోలీ లేదా జేక్ ఫ్రేజర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బ్యాటింగ్‌లో హెడ్, మ్యాక్స్‌వెల్‌లతో పాటు స్మిత్, లబుషేన్, కెరీలు ఉండటం బ్యాటింగ్‌కు బలం కల్పిస్తోంది.
బౌలింగ్‌లో డ్వార్షుయిస్, జాన్సన్, ఎలీస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్ జంపా,మ్యాక్స్‌వెల్,హెడ్,లబుషేన్‌లు మద్దతుగా ఉండటం ఆసీస్‌కు అదనపు ప్రయోజనం. హెడ్‌ను తొందరగా అవుట్ చేస్తే భారత విజయానికి మెజారిటీ అవకాశాలు ఉంటాయి.
వివరాలు
దుబాయ్ పిచ్ & మ్యాచ్ వివరాలు
దుబాయ్ పిచ్ కొంత మందకొడిగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్లు ఓపికతో ఆడితే విజయావకాశాలు మెరుగవుతాయి.
ఇక్కడ 260-270 పరుగుల లక్ష్యంతో మ్యాచ్‌ను గెలవడం సాధ్యమే. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే ఈ పిచ్‌లో బ్యాటింగ్ కాస్త కష్టమే.
వాతావరణ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్-18 చానళ్లలో లైవ్ ప్రసారం ఉంటుంది.
తుది జట్టు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్/పంత్, హార్దిక్, జడేజా, కుల్దీప్/హర్షిత్, షమీ, చక్రవర్తి. ఆస్ట్రేలియా: హెడ్, జేక్ ఫ్రేజర్/కనోలీ, స్మిత్ (కెప్టెన్), లబుషేన్, ఇంగ్లిస్, కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, జంపా, ఎలీస్, జాన్సన్.