
Champions Trophy: 'బుమ్రా లేకపోవడం పెద్ద లోటే'.. అర్షదీప్ దాని నుంచి బయటపడాలి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో వచ్చే గురువారం ప్రారంభం కానుంది. అయితే, భారత జట్టు ఈ టోర్నీలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగుతోంది. కెరీర్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రా, వెన్ను గాయంతో ఈ మెగా టోర్నీ నుంచి దూరమయ్యాడు. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్న భారత్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అనుభవజ్ఞుడైన బుమ్రా లేకపోవడం,జట్టుకు గణనీయమైన ప్రభావం చూపించనుంది. ఈ టోర్నీలో భారత జట్టు దాదాపుగా ఇద్దరు కొత్త పేసర్లతో బరిలోకి దిగబోతుంది. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాల వంటి అనుభవం తక్కువున్న బౌలర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. మొహమ్మద్ షమీ లాంటి సీనియర్ బౌలర్ జట్టులో ఉన్నప్పటికీ,గాయాల సమస్యలు,ఫామ్‌లో లేమి కొంత ఇబ్బంది కలిగించవచ్చు.
వివరాలు
టీ20ల నుంచి వన్డేలకు...
అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు బుమ్రా దూరం కావడం భారత అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన బుమ్రా, ఆ మ్యాచ్‌లలో తన ప్రభావాన్ని చూపించాడు. అందుకే, ఈసారి కూడా అతను ఉంటే బాగా ఉపయోగపడేదని అభిమానులు భావిస్తున్నారు. అర్షదీప్ సింగ్ భారత తరపున టీ20ల్లో అత్యంత విజయవంతమైన బౌలర్. ఇప్పటివరకు 99 వికెట్లు తీసి, దాదాపుగా అందరికంటే ముందున్నాడు. అయితే వన్డేల్లో మాత్రం అతనికి అంతగా అవకాశాలు రావడం లేదు.ఇప్పటి వరకు అతను కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడగా,14 వికెట్లు 23సగటుతో తీశాడు. ఈ గణాంకాలు మెరుగైనవే అయినా,వన్డేలు,టెస్టుల్లో అతనికి స్థానం దక్కడం లేదు.
వివరాలు
హర్షిత్ రానాపై ప్రత్యేక దృష్టి...
అతను లెఫ్ట్-ఆర్మ్ పేసర్ కావడం వల్ల బౌలింగ్ వైవిధ్యం పెరుగుతుంది. ప్రధాన జట్లు లెఫ్ట్-ఆర్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో సమస్యలు పడుతుంటాయి. ముఖ్యంగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ లెఫ్ట్-ఆర్మ్ బౌలింగ్ ఎదుర్కోవడంలో బలహీనత చూపిస్తాడు. అందువల్ల, ఇలాంటి బౌలర్లను సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. గౌతం గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఐపీఎల్‌లో తన ఆధ్వర్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. హర్షిత్ రాణా ఎంపికను చూసినప్పుడు, ఆ విమర్శలు నిజమేనేమో అనిపిస్తోంది. తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన అతను, టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ మాదిరిగా రాణించాడు.
వివరాలు
బలహీనమైన పేస్ దళంతో మెగా టోర్నీలో భారత్
అయితే, అతనికి చోటివ్వడం కోసం హైదరాబాదీ పేసర్ ముహమ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టారనే విమర్శలు ఉన్నాయి. మిడిల్ ఓవర్లలో అతను అంతగా ప్రభావం చూపడం లేదనే కారణంతో జట్టు నుంచి తొలగించారు. కానీ, ఒక బౌలర్ ఫామ్ కోల్పోతే అతనిని మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి కానీ, ఇలా పక్కన పెట్టడమా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి భారత్ కొంత బలహీనమైన పేస్ దళంతో మెగా టోర్నీలో అడుగుపెడుతోంది. అందుకే, స్పిన్నర్లపై ఎక్కువ బాధ్యత పెడుతోంది. ఐదుగురు స్పిన్నర్లు తమ ప్రతిభను నిరూపిస్తే, జట్టు నాకౌట్ దశకు చేరుతుందనే నమ్మకం ఉంది. భారత్ తన టోర్నీ ప్రయాణాన్ని ఈనెల 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది.