
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ వివాదం.. ఫిజియో ప్రాముఖ్యతపై సందీప్ పాటిల్ ప్రశ్నలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 'వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్' అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు అతడిని ప్రతి మ్యాచ్‌లోనూ ఆడించాలని సూచిస్తుంటే, మరికొందరు మాత్రం అతడిపై అదనపు ఒత్తిడి తేవడం సమంజసం కాదని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో మాజీ ఆటగాడు, మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కూడా స్పందిస్తూ, బీసీసీఐ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాలు
హెడ్ కోచ్, కెప్టెన్ కంటే ఫిజియో మాటే ముఖ్యమా?
"బుమ్రా కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాలని బీసీసీఐ అనుమతించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది.అంటే హెడ్ కోచ్, కెప్టెన్ కంటే ఫిజియో మాటే ముఖ్యమా? అతడు చెప్పిందే తుది నిర్ణయమా? మరి సెలక్టర్లు ఎక్కడ? సెలక్షన్ కమిటీ సమావేశాల్లో ఫిజియో కూడా హాజరవుతున్నాడా? నిర్ణయం అంతా అతడే తీసుకుంటున్నాడా? ఒక ఆటగాడు దేశం కోసం ఎంపికైతే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చివరివరకు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. గతంలో నేను సునీల్ గావస్కర్ ఐదు రోజుల పాటు నిరంతర బ్యాటింగ్ చేసిన సందర్భాలు చూశాను. కపిల్ దేవ్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసిన రోజులు కూడా గుర్తున్నాయి.వారు నెట్ ప్రాక్టీస్‌లోనూ విపరీతంగా బంతులు వేసేవారు.ఎప్పుడూ విరామం కోరలేదు,అసంతృప్తి వ్యక్తం చేయలేదు.
వివరాలు
బుమ్రా నిర్ణయానికి రహానె మద్దతు
అంతేకాకుండా,వారు అందరూ 16 ఏళ్లకు పైగా తమ కెరీర్‌ను కొనసాగించారు.నేను కూడా 1981లో తలకు గాయమైన తర్వాత టీంలోకి వచ్చాక ఎప్పుడూ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా లేను'' అని సందీప్ పాటిల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు, భారత మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె మాత్రం బుమ్రా వైపు నిలిచాడు. టెస్టు సిరీస్ మొదలయ్యే ముందు నుంచే బుమ్రా తాను ఏ మ్యాచ్‌లు ఆడతానో, ఏ మ్యాచ్ లలో విశ్రాంతి తీసుకుంటానో స్పష్టంగా చెప్పాడని రహానె వెల్లడించాడు.
వివరాలు
ముందే చెప్పాడుగా: రహానె
"బుమ్రా విషయంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, అతడు ఎప్పుడూ క్లియర్‌గా మాట్లాడతాడు. సిరీస్ ప్రారంభానికి ముందే - 'మొదటి టెస్టు ఆడతాను, రెండో టెస్టు ఆడను, మూడో టెస్టు తిరిగి ఆడతాను' అని కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్‌కి చెప్పేశాడు. తనకంటే జట్టు ప్రాధాన్యం ఎక్కువ అని అతడి ఆలోచన. భారత జట్టుకు ఆడే అవకాశం ఉన్నప్పుడు, పక్కన కూర్చుంటానని స్పష్టంగా చెప్పడం చాలా కష్టం. కానీ బుమ్రా అలా చెప్పగలిగాడు" అని రహానె వివరించాడు.