MI vs SRH: ముంబైకి విజయం కావాల్సిందే.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ముంబయి ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైకి అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఈ సీజన్‌లో మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ను ఎదుర్కొనబోతున్న ముంబైకి ఈ పోరు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు కొనసాగుతాయి. ఓడిపోతే ఈ సీజన్‌లో వారి ఆశలు దాదాపు ముగిసినట్టే.
వివరాలు
హోరా హోరీ పోరుకు సర్వం సిద్ధం..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం జట్టు ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపింది. టోర్నీ నియమాల ప్రకారం లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ముంబై ఎక్కువ విజయాలు సాధించాల్సిన అవసరం ఏర్పడింది. కనీసం ఆరు మ్యాచ్‌లు గెలిస్తేనే టాప్-4 అవకాశాలు బలపడతాయి. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
ముంబైని వేధిస్తున్న సమస్యలు ఇవే..
ముంబై జట్టు ప్రదర్శన విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (97), సూర్యకుమార్ యాదవ్ (110) ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇప్పటివరకు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి తన లయను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లు కూడా వికెట్లు తీయడంలో ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో బౌలింగ్ బాధ్యతలు ఎక్కువగా బుమ్రాపైనే పడుతున్నాయి. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యలతో దూరమవడం, అతని స్థానంలో వచ్చిన డానిష్ మలేవార్ ప్రభావం చూపకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారింది.
వివరాలు
బలమైన టీమ్‌గా హైదరాబాద్
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం బలంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అతను ఇప్పటికే 380 పరుగులు చేసి, అందులో ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 212.29 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ (312), హెన్రిచ్ క్లాసెన్ (349) కూడా నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం జట్టుకు మరింత బలాన్నిస్తోంది. ఇక ట్రావిస్ హెడ్ నుంచి హైదరాబాద్ జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది.