IPL 2026: ఐపీఎల్‌లో స్వదేశీ ఆటగాళ్ల దూకుడు.. విదేశీయుల నిరాశ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ అంటే గతంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లే ఆకట్టుకునేవారు. భారత స్టార్ల కంటే వారు మ్యాచ్‌లను ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుంటే, విదేశీ క్రికెటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో మెరవలేకపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను గమనిస్తే, కొద్దిపాటి మెరుపులు తప్ప విదేశీ ప్లేయర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
వివరాలు
విఫలమవుతున్నఆటగాళ్లు..
వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్‌ను సాధారణంగా నమ్మదగిన బ్యాటర్‌గా భావిస్తారు. గత సీజన్‌లో లక్నో సూపర్జెయింట్స్ తరఫున అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈసారి పూర్తిగా నిరాశపరిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో అతడి అత్యధిక స్కోరు కేవలం 19 పరుగులే కావడం అతడి ఫామ్ ఎంత దారుణంగా ఉందో చెబుతోంది. తక్కువ స్థాయి షాట్లు ఆడి త్వరగా ఔటవుతుండడంతో జట్టుకు తీవ్ర నష్టం కలుగుతోంది. అదే జట్టులో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఓపెనర్‌గా మంచి ఆరంభం ఇస్తున్నప్పటికీ, ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మార్చడంలో విఫలమవుతున్నాడు. ముఖ్య సమయాల్లో వికెట్ కోల్పోవడం జట్టుపై ప్రభావం చూపుతోంది.
వివరాలు
భయపెడుతున్న ఆట తీరు..
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోర్లలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లో ఆశించిన రీతిలో ఆడటం లేదు. ఇప్పటివరకు అతడి అత్యధిక స్కోరు 46 పరుగులే. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి తీసుకున్న కామెరూన్ గ్రీన్ కూడా నిరాశపరుస్తున్నాడు. సునీల్ నరైన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లు కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు. నరైన్ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం మూడు సార్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకోవడం గమనార్హం. ఇక బెంగళూరు తరఫున ఫిల్ సాల్ట్, గుజరాత్‌లో బట్లర్, హైదరాబాద్‌కు క్లాసెన్ మాత్రమే కొంత స్థిరంగా రాణిస్తున్నారు.
వివరాలు
ఆ హెలికాఫ్టర్ షాట్ అద్భుతం..
ఇదే సమయంలో భారత యువ ఆటగాళ్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో మెప్పిస్తున్నారు. జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు వస్తున్నారు. పేరెన్నికగన్న స్టార్లే కాకుండా, పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్లు కూడా తమ ప్రతిభతో మ్యాచ్‌లను తారుమారు చేస్తున్నారు. ముకుల్ చౌదరి అలాంటి ఆటగాళ్లలో ఒకడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుతంగా ఆడి లక్నోను విజయం వైపు నడిపించాడు. ఆశలు లేకపోయిన పరిస్థితిలో 54 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన హెలికాప్టర్ షాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
అద్భుతాలు చేస్తున్న ఇండియన్ ప్లేయర్స్..
ముంబయి జట్టు వరుస పరాజయాల నుంచి బయటపడటంలో తిలక్ వర్మ, అశ్వని కుమార్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న జట్టును తిలక్ అద్భుత సెంచరీతో గెలుపు దిశగా తీసుకెళ్లాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ మరో సంచలనంగా నిలుస్తున్నాడు. గత సీజన్‌లోనే తన ప్రతిభను చూపిన ఈ 15 ఏళ్ల యువకుడు, ఈసారి కూడా అదే జోష్ కొనసాగిస్తున్నాడు. అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ ధైర్యంగా భారీ షాట్లు ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి అతడు రాజస్థాన్‌కు వేగవంతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. ఇక భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటీదార్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతూ జట్లకు బలంగా నిలుస్తున్నారు.