Page Loader
ICC: టాప్-10లోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్
టాప్-10లోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్

ICC: టాప్-10లోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. భారత్‌-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ముగియడంతో ఈ ర్యాంకింగ్స్‌ ను ప్రకటించారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదుగురు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. టాప్-10లో పంత్, జైస్వాల్ మినహా ఎవరూ స్థానం సంపాదించుకోలేకపోయారు. భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టులో ఓడిపోయి, సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. న్యూజిలాండ్ చివరి టెస్టులో విజయానికి కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Details

26వ స్థానానికి పడిపోయిన రోహిత్ శర్మ

మరోవైపు, శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో సత్తాచాటిన అనంతరం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నారు. యువ ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, జైస్వాల్‌ను వెనక్కి నెట్టుకొని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమవడంతో 8 స్థానాలు పడిపోయి 22వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 26వ స్థానానికి దిగజారాడు. ఇక రవీంద్ర జడేజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.

Details

ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా అగ్రస్థానం

అశ్విన్ ఓ ర్యాంక్‌ను కోల్పోయి అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, అక్షర్ పటేల్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిది ర్యాంక్‌కు పడిపోయాడు. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టాప్-4లో ఉన్నాయి.