IND vs ENG:తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఫైర్.. 'పేరుకే ఆల్‌రౌండర్' అంటూ సుందర్‌పై విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత టీ20 జట్టుకు హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్ స్థానంలో తిలక్‌కు ఈ బాధ్యతలు అప్పగించగా,ఇకపై టీ20ల్లో శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం జట్టు ఎంపిక సందర్భంగా సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని శ్రీకాంత్ పేర్కొన్నాడు. తిలక్‌కు కెప్టెన్సీ అనుభవం లేదని,ఇటీవల కాలంలో అతడి ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డాడు.
వివరాలు
మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కనపెట్టి తిలక్‌కు కీలక బాధ్యతలు
అంతేకాకుండా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే దూకుడు అతడిలో కనిపించడం లేదని చెప్పాడు. గత రెండు, మూడు ఐపీఎల్ సీజన్లతో పాటు ఈ ఏడాది టోర్నీలో కూడా తిలక్ నిరాశపరిచాడని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని కూడా శ్రీకాంత్ తప్పుబట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కనపెట్టి తిలక్‌కు కీలక బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. భారత టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎంపికపైనా శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున సుందర్ పెద్దగా బౌలింగ్ చేయలేదని, ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా మాత్రమే ఆడాడని గుర్తు చేశాడు.
వివరాలు
ఆల్‌రౌండర్ కోటాలో సుందర్‌ను ఎలా ఎంపిక చేశారో..
టీమిండియాలో కూడా అతడు క్రమం తప్పకుండా బౌలింగ్ చేయడం లేదని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో సుందర్‌ను ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి ఎలా ఎంపిక చేశారో సెలక్టర్లకే తెలియాలని శ్రీకాంత్ ఎద్దేవా చేశాడు. అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న రజత్ పాటిదార్‌కు అవకాశం కల్పించి ఉంటే జట్టుకు మరింత ఉపయోగపడేదని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిప్రాయపడ్డాడు.