రసవత్తరంగా వరల్డ్ కప్ సెమీస్ రేసు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను భయపెడుతున్న ఆఫ్ఘనిస్తాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో కొన్ని సంచలన విజయాలు నమోదు కావడంతో సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే భారత జట్టుకు సెమీఫైనల్ బెర్తు దాదాపుగా ఖరారైంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా 9 జట్లు పోటీపడుతున్నాయి. టీమిండియా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక సౌతాఫ్రికా ఐదు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న భారత్ సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడానికి కేవలం ఒక పాయింట్ మాత్రమే అవసరం.
సౌతాఫ్రికాకు మరో మూడు పాయింట్లు కావాలి
టీమిండియా చివరి మూడు మ్యాచుల్లో ఒక విజయం లేదా డ్రాగా ముగిసిన సరిపోతుంది. ఒకవేళ భారత్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే, ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే భారత్ సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది. సౌతాఫ్రికా సెమీఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి మరో మూడు పాయింట్లు కావాలి. వారు తర్వాతి మ్యాచుల్లో న్యూజిలాండ్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనున్నారు. మరో ఒక విజయం సాధిస్తే సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు చేరడానికి 75శాతం అవకాశం ఉంది. వారు తదుపరి మ్యాచుల్లో సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకతో తలపడతారు. ఈ మూడు మ్యాచుల్లో కనీసం రెండు విజయాలు సాధించాలి.
ఆస్ట్రేలియాకు మెరుగైన నెట్ రన్ రేట్ కావాలి
ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరడానికి 74శాతం అవకాశాలున్నాయి. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఇంకా రెండు విజయాలు సాధిస్తే సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. నెట్ రన్‌రేట్ కూడా ఆస్ట్రేలియాకు చాలా అవసరం. పాకిస్థాన్ సెమీస్ చేరడానికి 13శాతం అవకాశం ఉంది. పాకిస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై కూడా గెలవాలి. అదే సమయంలో ప్రస్తుతం టాప్-4లో ఉన్న విజయాలపై పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు అధారపడి ఉన్నాయి.
శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లండ్ సెమీస్ అశలు గల్లంతు
ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరడానికి 31శాతం అవకాశం ఉంది. అక్టోబరు 30న శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మొదటిసారిగా ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. వారు తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడిస్తే 12 పాయింట్లు వస్తాయి. ఇక శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లండ్ దాదాపుగా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లే.