Page Loader
Champions Trophy: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్‌బై..?
ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్‌బై..?

Champions Trophy: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్‌బై..?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈనెల 9న న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే, ప్రస్తుతానికి ఓ వార్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, వీరిద్దరూ కూడా అదే దారిలో సాగుతారా అనే చర్చ జరుగుతోంది.

వివరాలు 

వీరి నిర్ణయం కోసం బీసీసీఐ వెయిటింగ్‌?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి పాలైన జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన వెంటనే, పలువురు క్రికెటర్లు వన్డేలకు వీడ్కోలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికుర్ రహీమ్ లాంటి ఆటగాళ్లు వన్డేలకు గుడ్‌బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో, ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న ప్రచారం గట్టిగా వినపడుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఫైనల్ అనంతరం వీరు అధికారికంగా ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

వన్డేలకు కూడా వీరు వీడ్కోలు చెప్పే అవకాశాలు

2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత,విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డేలకు కూడా వీరు వీడ్కోలు చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇటీవల తన యూట్యూబ్ వీడియోలో స్పందిస్తూ, ''వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలనే నిర్ణయం పూర్తిగా కోహ్లీ, రోహిత్‌ల మీదే ఆధారపడి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది సులభమైన నిర్ణయం కాదు. 2025లోనూ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌లో ఉన్నాడు.రోహిత్ ప్రదర్శన కూడా మెరుగ్గానే ఉంది,కానీ అద్భుతం అనలేను. అయితే, ఫైనల్లో సెంచరీ సాధించడం ద్వారా అతను తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకోగలడు'' అంటూ వ్యాఖ్యానించాడు.