Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే రిటైన్ చేసుకొనే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చింది. ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండ్లీ ప్లవర్ నేతృత్వంలో ఐపీఎల్ 2025 సీజన్‌కు అన్ని విధాల సమాయత్తమవుతోంది. బీసీసీఐ కూడా మెగా వేలం నిర్వహించడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల నుంచి సలహాలు, సూచలను తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుంది. వేలం రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొనే అవకాశం ఉంది.
మెగా వేలానికి సిద్ధంగా ఆర్సీబీ
విరాట్ కోహ్లీకి మళ్లీ సారథ్య బాధ్యతలను ఇచ్చి, జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేస్తే బాగుంటుందని ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తోంది. కోహ్లీ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ నియమితులయ్యారు. అయితే 40 ఏళ్ల వయస్సు ఉన్న డుప్లెసిస్‌ను మళ్లీ రిటైన్ చేసుకొనే అవకాశం లేదు. ఒకవేళ రిటైన్ తీసుకున్న అతనికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి.
లండన్ లో విరాట్ కోహ్లీ
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్న జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లను వేలం కొనుగోలు చేసి, వీరిలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యలను చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఎలాగైనా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ విరాట్ కోహ్లీని మళ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడితే కోహ్లీ అభిమానుల సంతోషానికి హద్దే ఉండదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఫ్యామిలీతో లండన్‌లో ఉన్నాడు.