Page Loader
ENG vs IND: రేపటి నుండి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్.. హెడింగ్లీలో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే? 
రేపటి నుండి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్.. హెడింగ్లీలో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే?

ENG vs IND: రేపటి నుండి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్.. హెడింగ్లీలో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో భారత్ మధ్య జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌కు సంబంధించి తొలి మ్యాచ్ జూన్ 20న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నిర్వహించనున్నారు. అయితే ఈ మైదానంలో భారత్‌ చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడింది ఇక్కడ భారత్ ఇప్పటివరకు కేవలం ఏడుసార్లు మాత్రమే ఆడింది. అందులో భారత్ రెండుసార్లు విజయం సాధించగా,ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిపాలైంది. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు హెడింగ్లీ మైదానంలో చివరిసారిగా విజయాన్ని 2002 ఆగస్టు 22న సాధించింది. అప్పట్లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు, 1986 జూన్ 19న భారత్ ఇంగ్లండ్‌ను 279 పరుగుల తేడాతో ఓడించింది.

వివరాలు 

గంగూలీ కెప్టెన్సీలో 2002 విజయం 

ఈ మైదానంలో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు 1952 జూన్ 5న జరిగింది. చివరిసారి ఇరు జట్లు ఇక్కడ 2021 ఆగస్టు 25న తలపడ్డాయి. 2002 ఆగస్టు 22 నుండి 26 వరకు జరిగిన టెస్టులో సౌరబ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్,తన తొలి ఇన్నింగ్స్‌ను 628/8 వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ 193, రాహుల్ ద్రావిడ్ 148, గంగూలీ 128 పరుగులు చేశారు. ఓపెనర్ సంజయ్ బంగర్ 68 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది.

వివరాలు 

గంగూలీ కెప్టెన్సీలో 2002 విజయం 

భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తలో 3 వికెట్లు తీశారు. జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఫాలోఆన్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఈసారి అనిల్ కుంబ్లే 4 వికెట్లు పడగొట్టగా, బంగర్ 2 వికెట్లు తీశాడు. జహీర్ ఖాన్, అగార్కర్, హర్భజన్ చెరో వికెట్ తీసుకున్నారు. చివరకు భారత్ ఇన్నింగ్స్, 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రాహుల్ ద్రవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

వివరాలు 

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2021 పరాజయం 

2021 ఆగస్టు 25 నుండి 28 మధ్య జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు హెడింగ్లీలో ఇంగ్లండ్‌ను ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా కేవలం 78 పరుగులకే కుప్పకూలిపోయింది. రోహిత్ శర్మ అత్యధికంగా 19 పరుగులు చేశాడు. ఆపై ఇంగ్లండ్ జట్టు 432 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 121 పరుగులు చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 91, రోహిత్ 59, కోహ్లీ 55 పరుగులు చేశారు. అయినప్పటికీ, భారత జట్టు 278 పరుగులకు ఆలౌటైపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.

వివరాలు 

గిల్ కెప్టెన్సీలో భారత్ 

ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించగా, భారత జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆధ్వర్యంలో హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. టీమ్‌ఇండియా గత చరిత్రను మరిచిపోయి, విజయ పరంపరను ప్రారంభించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.