Trump: ఉక్కు,అల్యూమినియం సుంకాల నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
తమ దేశ ఉత్పత్తులపై సుంకాలను విధించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిస్పందనగా ప్రతి సుంకాలను (Reciprocal Tariffs) విధిస్తున్నారు.
అమెరికా తమ వ్యాపార భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% సుంకాలను 50%కి పెంచనున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 2 నుంచి ఈ సుంకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఏ పరిస్థితుల్లోనూ దీన్ని తగ్గించేది లేదని, ఎటువంటి మార్పులూ ఉండవని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ట్రంప్ మాట్లాడుతూ, ఈ సుంకాల అమలులో ఏ దేశానికీ మినహాయింపులు ఉండవని స్పష్టంచేశారు.
వివరాలు
ఏప్రిల్ 2 అమెరికాలో కీలకమైన రోజు
''ఏప్రిల్ 2 అమెరికా కోసం కీలకమైన రోజు. గతంలో పాలించిన అనుభవరహిత, తెలివితక్కువ అధ్యక్షులు మన దేశ సంపదను వృథా చేశారు. అయితే, ఇప్పుడు విధిస్తున్న సుంకాల ద్వారా మనకు నష్టపోయిన సంపదలో కొంత భాగాన్ని తిరిగి పొందగలుగుతాం. ఇప్పటివరకు ఇతర దేశాలు మన సంపదను లాగించాయి, కానీ ఇప్పుడు మనం వాటిని తిరిగి సాధించేందుకు ఈ అదనపు సుంకాలను విధిస్తున్నాం'' అని ట్రంప్ పేర్కొన్నారు.
వివరాలు
మరిన్ని రంగాల్లోనూ సుంకాలు
అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
కెనడా, మెక్సికోతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు.
ఈ నిర్ణయంపై వాణిజ్య మంత్రిని కూడా ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని రంగాల్లోనూ సుంకాలను విధించనున్నట్లు వెల్లడించారు.
''వారు మన ఉత్పత్తులపై 130% సుంకాలను విధిస్తుంటే, మనం ఏమీ చేయకపోవడం తగదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తాజా సుంకాల ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలవరం నెలకొంది.