
Donald Trump: మోదీ ఏదో చెప్పబోయారు... కానీ నేను టారిఫ్‌ల విషయంలో మినహాయింపు లేదని స్పష్టంగా చెప్పాను: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ,టారిఫ్‌ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రధాని నరేంద్ర మోదీకి తాను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.
ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో టారిఫ్‌ల అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ తాజాగా బయటపెట్టారు. బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌తో కలిసి ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, "మన మధ్య పరస్పరం పన్నులు విధించుకోవాల్సి ఉంటుంది. ఇది నేను మోదీకి కూడా చెప్పాను. మీరు ఎంత ఛార్జ్ చేస్తే, నేను కూడా అంతే విధిస్తాను. మోదీ ఏదో చెప్పబోయారు... కానీ వద్దు, నేను దానిని ఇష్టపడను. పన్నుల విషయంలో తాను గట్టిగా ఉన్నాను" అని వివరించారు.
వివరాలు
భారత్ టారిఫ్ విధానంపై ట్రంప్ విమర్శ
అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటి.ముఖ్యంగా ఆటో మొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
భారత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై దాదాపు 100% టారిఫ్ విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు.
ఆయన పక్కనే ఉన్నమస్క్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు."అవును, ఆటో దిగుమతులపై భారత్ 100% పన్ను విధిస్తోంది"అని మస్క్ అన్నారు.
ట్రంప్ దీన్ని మరింత వివరిస్తూ,"ఇది చాలా ఎక్కువ.ఇతర దేశాలు కూడా ఇలానే పన్నులు విధిస్తున్నాయి.నేను 25% టారిఫ్ పెడితే,అది చాలా భయంకరంగా ఉందని అంటారు.అందుకే,నేను ఇక ఆ మాట అనను. వారు ఎంత విధిస్తే, మేమూ అంతే విధిస్తాం.నాతో ఎవరూ వాదించలేరు.అప్పుడే వారు తమ సుంకాలను తగ్గిస్తారు"అని అన్నారు.
వివరాలు
భారత్‌పై గతంలోనూ ట్రంప్ వ్యాఖ్యలు
ఇది తొలిసారి కాదు, ట్రంప్ తన గత పాలనలో కూడా భారత్ టారిఫ్ కింగ్ అని వ్యాఖ్యానించేవారు.
అంతేకాక, అమెరికా భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరగడానికి 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలని ఎలా భావిస్తుంది? అని ప్రశ్నించారు.
"న్యూఢిల్లీలో చాలా డబ్బు ఉంది. ప్రపంచంలో అత్యధిక పన్నులు విధించే దేశాల్లో ఒకటిగా భారత్ ఉంది. కానీ, తమ దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది?" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించిన సమయంలో, 2030 నాటికి భారత్-అమెరికా వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.