US Tariffs: కెనడా,మెక్సికోలపై 25% టారిఫ్‌లు.. మార్చి 4 నుంచి అమల్లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాలను (USA Tariffs) విధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ సుంకాలు మార్చి 4 నుంచి అమలులోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
ఇందులో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టంగా తెలిపారు. ఈ టారిఫ్‌లు అసలు ఫిబ్రవరి 4 నుంచే అమలులోకి రావాల్సి ఉండగా, కొన్ని చర్చల కారణంగా ఆలస్యమయ్యాయి.
మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్ బామ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో జరిగిన చర్చల అనంతరం, ఇరుదేశాలపై విధించిన అదనపు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
వివరాలు
నడా, మెక్సికోతో పాటు అనేక దేశాలు అమెరికాపై అధిక సుంకాలు
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు.
గతంలో కెనడా, మెక్సికోతో పాటు అనేక దేశాలు అమెరికాపై అధిక సుంకాలు విధించాయని, తమ దేశ ఆర్థిక వనరులను అన్యాయంగా ఉపయోగించుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, దీనికి ప్రధాన కారణం గతంలో అమెరికా ప్రభుత్వాల తీరేనని స్పష్టం చేశారు.
ఇకపై, ఇతర దేశాలపై విధించే టారిఫ్‌లను కొనసాగిస్తామని, తమపై అధిక సుంకాలు విధించే దేశాల నుండి సమానంగా ఆదాయం పొందడం తగిన చర్యేనని ఆయన పేర్కొన్నారు.
తన నిర్ణయాల వల్ల అమెరికా మరలా ఆర్థికంగా బలపడుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
అమెరికా ఉత్పత్తులపై 25% సుంకం
అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ట్రంప్ మెక్సికో, కెనడా వంటి పొరుగుదేశాలతో పాటు చైనాపై కూడా భారీ సుంకాలు విధించారు.
కెనడా, మెక్సికో నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% చొప్పున, చైనా ఉత్పత్తులపై 10% టారిఫ్‌ను అమలు చేస్తూ ఆదేశాలపై సంతకం చేశారు.
అంతేకాదు, వలసల నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే, అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ట్రూడోకు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ చర్యలకు ప్రతిస్పందనగా, మెక్సికో, కెనడా కూడా తమ వైఖరిని మారుస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలు
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా విధిస్తున్న ఈ సుంకాలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో, అమెరికన్ల ఆర్థిక భారాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యేల్ విశ్వవిద్యాలయం పరిధిలోని బడ్జెట్ ల్యాబ్ చేసిన అధ్యయనం ప్రకారం, ఈ చర్యల వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించారు.