Page Loader
Elon Musk:ఎలాన్‌ మస్క్‌'కు డీప్‌సీక్‌ దెబ్బ.. సంపదలో ఏకంగా 90 బిలియన్‌ డాలర్లు ఆవిరి  
ఎలాన్‌ మస్క్‌'కు డీప్‌సీక్‌ దెబ్బ.. సంపదలో ఏకంగా 90 బిలియన్‌ డాలర్లు ఆవిరి

Elon Musk:ఎలాన్‌ మస్క్‌'కు డీప్‌సీక్‌ దెబ్బ.. సంపదలో ఏకంగా 90 బిలియన్‌ డాలర్లు ఆవిరి  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కృత్రిమ మేధ (AI) రంగంలో సంచలనంగా మారిన చైనా స్టార్టప్‌ డీప్‌సీక్‌ (DeepSeek), అమెరికా టెక్‌ కంపెనీలను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో టెక్‌ దిగ్గజాల సంపద భారీగా క్షీణించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk) కేవలం నెలరోజుల్లోనే సుమారు 90 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.7.9 లక్షల కోట్లు) నష్టపోయారు. అలాగే, ఎన్విడియా (Nvidia), మెటా (Meta) అధినేతల ఆస్తులు కూడా గణనీయంగా తగ్గాయి.

వివరాలు 

అత్యంత ధనవంతుల సంపద క్షీణత

ఈ ఏడాది జనవరిలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపద 314 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇది కోటిన్నర మంది ఉద్యోగుల సగటు వార్షిక వేతనాలకు సమానంగా ఉంది. అయితే, ఈ లాభాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఫిబ్రవరి ప్రారంభంలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ నికర సంపద 433 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, నెలాఖరుకల్లా అది 349 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంటే కేవలం ఒక నెలలోనే 90 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌ సంపద 20 బిలియన్‌ డాలర్లు తగ్గింది. మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ నికర ఆస్తులు 11 బిలియన్‌ డాలర్లు తగ్గాయి.

వివరాలు 

తగ్గిన ల్యారీ పేజ్‌ నికర సంపద 6.3బిలియన్‌ డాలర్లు 

ఒరాకిల్‌ ఛైర్మన్‌ ల్యారీ ఎలిసన్‌ 27.6 బిలియన్‌ డాలర్లు నష్టపోయి, ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నుంచి ఐదో స్థానానికి దిగిపోయారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్‌ నికర సంపద 6.3బిలియన్‌ డాలర్లు తగ్గింది. డీప్‌సీక్‌ ప్రభావం & అమెరికా టెక్‌ కంపెనీల నష్టం చైనా హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న AI రీసెర్చ్‌ కంపెనీ డీప్‌సీక్‌ (DeepSeek) ను 2023లో లియాంగ్ వెన్‌ఫెంగ్‌ స్థాపించారు. ఇటీవల ఈ కంపెనీ "ఆర్‌1" అనే ఏఐ మోడల్‌ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఓపెన్‌ఏఐ (OpenAI), క్లాడ్‌ సోనెట్‌ (Claude Sonnet) వంటి కంపెనీలు సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగా సేవలు అందిస్తుండగా, డీప్‌సీక్‌ పూర్తి ఉచితంగా అత్యాధునిక ఏఐ మోడల్‌ను అందించడంతో యూజర్లను విశేషంగా ఆకర్షించింది.

వివరాలు 

600 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయిన ఎన్విడియా  

దీని ప్రభావంతో డీప్‌సీక్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఎన్విడియా & ఇతర టెక్‌ కంపెనీల భారీ నష్టం డీప్‌సీక్‌ ఆధునిక మోడళ్లను తక్కువ అధికారం కలిగిన చిప్స్‌తో రూపొందించామని ప్రకటించడం, అమెరికా టెక్‌ పరిశ్రమను కుదిపేసింది. ఈ ప్రకటనతో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఒరాకిల్‌, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా, ఎన్విడియా మార్కెట్‌ విలువలో ఏకంగా 600 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక కంపెనీ తక్కువ వ్యవధిలో ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలు గమనిస్తే, డీప్‌సీక్‌ ప్రభావం కేవలం ఏఐ రంగానికే కాకుండా, ప్రపంచ వ్యాపార రంగాన్ని కూడా తాకిందని స్పష్టంగా కనిపిస్తోంది.