Page Loader
Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన శరీరంలోని ఎముకల వరకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయని వైద్య పరీక్షల్లో తేలిందని ఆయన కార్యాలయం వెల్లడించింది. మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు కనిపించడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి బయటపడిందని వివరించారు. బైడెన్‌కి తలెత్తిన క్యాన్సర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు, వైద్య నిపుణులతో కలిసి చికిత్సపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జో బైడెన్ అనారోగ్యం నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో తాను,తన భార్య మెలానియా తీవ్రంగా బాధపడ్డామని తెలిపారు.

వివరాలు 

బైడెన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ట్రంప్ 

ఆయన త్వరగా కోలుకోవాలని తమ ఆకాంక్ష అని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ తన స్పందనను తెలియజేశారు. ఇదే సమయంలో, అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా స్పందిస్తూ,ఇలాంటి సంక్లిష్ట సమయంలో బైడెన్ కుటుంబానికి తాము పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పారు. బైడెన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,ఆయన ఒక పోరాట యోధుడని, ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా కమలా హారిస్ 

జో బైడెన్ 2021 నుండి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. అయితే గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ విఫలమవడంతో పోటీ నుండి తప్పుకున్నారు. ఫలితంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిగా బరిలో దిగారు.కానీ 2024 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే.