Donald Trump: రాయితీలు కల్పించడం కంటే.. ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం కావడమే మంచిది: డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలకు అందిస్తున్న రాయితీలపై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కెనడా, మెక్సికో వంటి దేశాలకు భారీ రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు దేశాలు అమెరికా రాష్ట్రాలుగా మారితే మంచిదని పేర్కొన్నారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు 8 లక్షల కోట్లకు పైగా) రాయితీగా ఇస్తున్నామని, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల (సుమారు 24 లక్షల కోట్ల రూపాయలు) సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు. ఈ రాయితీలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తూ, కెనడా, మెక్సికో దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిదని అభిప్రాయపడ్డారు.
అక్రమ వలసదారుల కట్టడిపై ఇప్పటికే గట్టిగా స్పందించిన ట్రంప్
కెనడా, మెక్సికో దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తానని కాబోయే అధ్యక్షుడు ఇదివరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫ్లోరిడాలో ట్రంప్‌ను కలవగా, ఆ సమావేశంలో టారిఫ్‌లు, సబ్సిడీల అంశాలు చర్చకు వచ్చాయని తెలిసింది. కెనడా వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి సమస్యలను సమర్థంగా నివారించలేకపోతే, ఆ దేశం అమెరికా 51వ రాష్ట్రంగా మారాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
నాలుగేళ్లలో అక్రమ వలసదారులందరినీ అమెరికా దాటిస్తా..
ఇక అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ తన దృష్టిని సారించారు. అధికారం చేపట్టిన మొదటి రోజునుంచే పుట్టుక ఆధారిత పౌరసత్వంపై దృష్టిపెట్టి, వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తానని స్పష్టం చేశారు. "డ్రీమర్ ఇమ్మిగ్రెంట్స్" సమస్యకు ఒక ప్రత్యేక ఒప్పందం తీసుకురావడం కూడా పరిశీలిస్తానని చెప్పారు.