Page Loader
ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం
ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం

ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం

వ్రాసిన వారు Stalin
Jun 21, 2023
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది. చైనా తీరుపై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అనేక సభ్యదేశాలు సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి మద్దతు తెలిపాయని భారత్ పేర్కొంది. ఉగ్రవాదిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదన విజయవంతం కాకపోతే గ్లోబల్ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌లో ఏదో తప్పు ఉందని అనుకోవాల్సి ఉందని భారత్ పేర్కొంది. సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి, అతనిని ఆస్తుల స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధం, ఆయుధాలపై నిషేధం విధించే ప్రతిపాదనను భద్రతా మండలిలోని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రవేశపెట్టాయి.

చైనా

సాజిద్ మీర్‌పై 5మిలియన్ డాలర్ల రివార్డు

భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధించకపోతే, టెర్రరిజంపై నిజాయితీగా పోరాడే నిజమైన రాజకీయ సంకల్పం భద్రతా మండలికి లేనట్లే అని భారత్ ఐక్యరాజ్య సమితి నొక్కి చెప్పింది. గతేడాది సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితిలో సాజిద్ మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా పేర్కొనే ప్రతిపాదనను చైనా మొదట అడ్డుకుంది. ఇప్పుడు మరోసారి మోకాలడ్డింది. సాజిద్ మీర్ భారతదేశం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. 166 మంది మరణించిన 2008 ముంబై ఉగ్రదాడిలో అతని తలపై 5మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. గత సంవత్సరం మీర్ ప్రమేయానికి రుజువుగా ముంబైలో జరిగిన యూఎన్ సమావేశంలో భారతదేశం ఆడియో క్లిప్‌ను ప్లే చేసింది.