Iran: అత్యాధునిక అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఇరాన్ యోచన.. అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలని నిర్ణయించుకున్న వెంటనే, అక్కడి శాస్త్రవేత్తలు దాన్ని సిద్ధం చేసేందుకు రహస్యంగా తమ యత్నాలను ప్రారంభించారు.
ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని, ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
దేశ నాయకత్వం నుండి అణుబాంబు తయారీకి అనుమతి లభించిన వెంటనే, ఇరాన్ వద్ద ఉన్న యూరేనియం నిల్వలతో కొన్ని నెలల్లోనే బాంబును తయారు చేయడానికి ఒక వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు సేకరించారు. తాజాగా, ఇప్పుడు ట్రంప్ కార్యవర్గంతో కూడా దీనిని పంచుకున్నారు.
వివరాలు
ఇజ్రాయెల్‌లో నెతన్యాహును బలోపేతం చేసిన ట్రంప్
ఇటీవల సిరియా, పాలస్తీనా, లెబనాన్‌లలో జరిగిన పరిణామాల కారణంగా పశ్చిమాసియాలో ఇరాన్ పట్టు కొంత సడలిపోయింది.
ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో సిరియా తిరుగుబాటుదారులు ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న బలగాలను ఎదుర్కొన్నారు.
అంతేకాకుండా, ఇజ్రాయెల్ క్షిపణి, వైమానిక దాడుల ద్వారా ఇరాన్ ఆయుధ తయారీ సామర్థ్యాన్ని దెబ్బతీశారు.
ఇక ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే, ఇజ్రాయెల్‌లో నెతన్యాహును బలోపేతం చేశారు.
అదే సమయంలో,ఇరాన్ తన సెంట్రిఫ్యూజ్ వ్యవస్థలో మార్పులు చేసి, బాంబు-గ్రేడ్ యూరేనియంను ఉత్పత్తి చేయడంలో వేగాన్ని పెంచింది.
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం, ఇరాన్ 60 శాతం శుద్ధి చేసిన యూరేనియంను ఉత్పత్తి చేస్తోంది.కానీ పౌర అణు అవసరాల కోసం ఏ దేశం కూడా ఈ స్థాయిలో శుద్ధి చేయదని పేర్కొంది.
వివరాలు
ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యూరేనియం
అణుబాంబు తయారీకి 42 కిలోల 90 శాతం శుద్ధి చేసిన యూరేనియం ఉంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం, ఇరాన్ వద్ద 200 కిలోల వరకు 60 శాతం శుద్ధి చేసిన యూరేనియం ఉంది.
గత వారం, ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, తమ అణు స్థావరాలపై దాడులు జరిగితే, తాము చాలా వేగంగా, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
దీని వల్ల పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.