LOADING...
Palestine Recognition: పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన.. ఇజ్రాయెల్ ఆగ్రహం
పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన.. ఇజ్రాయెల్ ఆగ్రహం

Palestine Recognition: పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన.. ఇజ్రాయెల్ ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ నెలలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాలస్తీనాకు గుర్తింపు ఇచ్చేందుకు ఫ్రాన్స్ సిద్ధమవుతోందని ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధం తర్వాత గాజాలో ఏర్పడిన తీవ్రమైన మానవీయ సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ దాడుల మధ్య చిక్కుకున్న వేలాది మంది అమాయకులు ఆకలితో తల్లడిల్లుతున్న దృశ్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఈ తరుణంలో మాక్రాన్ ప్రకటన విశేషంగా ప్రాధాన్యంగా మారింది.

వివరాలు 

శాంతిని సాధించాలంటే మరో మార్గం లేదు: మాక్రాన్

గాజాలో యుద్ధాన్ని తక్షణంగా ఆపాల్సిన అవసరం ఉందని మాక్రాన్ స్పష్టంగా పేర్కొన్నారు. అక్కడ పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. గాజాలో శాంతిని సాధించడం పూర్తిగా సాధ్యమేనని, అది మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి మార్గం అవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, ఫ్రాన్స్ ప్రజల అభిమతాన్ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతా సహాయాన్ని పెంపు వంటి చర్యలు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతిని సాధించాలంటే మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌తో పాటు, ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు, యూరోప్ దేశాలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి శాంతిని స్థాపించగలమని మాక్రాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనపై పాలస్తీనా హర్షం

ఇదిలా ఉండగా,ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా విమర్శలు చేశారు. అక్టోబర్ 7న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం అంటే ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పడే పాలస్తీనాదేశం ఇరాన్‌కు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పాలస్తీనా నేతలు విధ్వంసక చర్యలకే కట్టుబడి ఉన్నారని ఆరోపించారు.మరోవైపు,ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనపై పాలస్తీనా హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. వీటిలో అనేక యూరోప్ దేశాలూ ఉన్నాయి.అయితే శక్తివంతమైన దేశమైన ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ విషయంలో ఇది ఒక తొలి,కీలకమైన ముందడుగుగా మారిందని విశ్లేషణలు చెబుతున్నాయి.