'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది. 22 గ్లోబల్ లీడర్‌లపై సర్వే చేసింది. ఇందులో అగ్రదేశాధినేతలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వెనక్కి నెట్టి ప్రధాని మోదీ ఏకంగా 78 శాతం రేటింగ్ ను పొందారు.
ఆరో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్
ఈ సంవత్సరం జనవరి 26 నుంచి 31 మధ్య 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' సర్వే నిర్వహించింది. స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ 62 శాతం రేటింగ్‌తో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 40శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోస్థానంలో నిలవడం గమనార్హం. యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ పదోస్థానానికి పరిమితమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రపంచాన్ని విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా 'ఇది యుద్ధాల యుగం కాదు' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోదీ సూచించిడం, భారత ప్రధాని ఇమేజ్ మరింత పెరగడానికి దోహదపడింది.