Page Loader
Tahawwur Rana: 'భారతీయులకు అలా జరగాల్సిందే'.. హెడ్లీతో తహవూర్ రాణా : అమెరికా న్యాయ శాఖ
'భారతీయులకు అలా జరగాల్సిందే'.. హెడ్లీతో తహవూర్ రాణా : అమెరికా న్యాయ శాఖ

Tahawwur Rana: 'భారతీయులకు అలా జరగాల్సిందే'.. హెడ్లీతో తహవూర్ రాణా : అమెరికా న్యాయ శాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

2008లో ముంబైలో చోటు చేసుకున్న ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన డేవిడ్ హెడ్లీ, అతని సహచరుడు తహవూర్ రాణా మధ్య జరిగిన సంభాషణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ సంభాషణల్లో హెడ్లీతో రాణా మాట్లాడుతూ, భారత భద్రతా దళాల చేతిలో మృతి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, పాకిస్తాన్ దేశం తమ సైనికులకు ప్రదానం చేసే గౌరవప్రదమైన 'నిషాన్ ఏ హైదర్' అవార్డు ఇవ్వాలని కోరినట్లు వెల్లడయ్యింది. అమెరికా న్యాయ విభాగం ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశానికి తహవూర్ రాణాను అప్పగించిన విషయాన్ని అమెరికా "భయంకరమైన దాడుల్లో బాధితుల కుటుంబాలకు న్యాయం చేసే దిశగా కీలకమైన ముందడుగు"గా అభివర్ణించింది.

వివరాలు 

చికాగోలో ఇమ్మిగ్రేషన్ సంబంధిత వ్యాపారంలో రాణా

అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ సమయంలో ముంబైపై దాడులు, లష్కరే తోయిబా సంస్థ కార్యకలాపాలపై వీరిద్దరూ అనేకసార్లు చర్చించినట్లు ఆధారాలున్నాయి. చికాగోలో ఇమ్మిగ్రేషన్ సంబంధిత వ్యాపారంలో ఉన్న రాణా, భారతదేశంలోని ముంబైలో కూడా ఒక కార్యాలయం ప్రారంభించాలని యత్నించాడు. ఆ రంగంలో అనుభవం లేకున్నా,హెడ్లీనే ఆ కార్యాలయానికి మేనేజర్‌గా పెట్టాలని నిర్ణయించాడు. ముంబై దాడుల అనంతరం కూడా వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగినట్లు సమాచారం. దాడిలో జరిగిన నష్టం గురించి హెడ్లీ మాట్లాడగా,"భారతీయులకు ఇలాగే జరగాలి"అనే విధంగా రాణా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, హెడ్లీ పలు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించిన బాధ్యతను కూడా రాణానే నిర్వహించినట్లు చెబుతున్నారు.

వివరాలు 

ఉగ్రదాడుల్లో ప్రధాన పాత్రధారులు 

డేవిడ్ కోల్మన్ హెడ్లీ (మూల పేరు దావూద్ గిలానీ),తహవూర్ హుసేన్ రాణా.. ఈ ఇద్దరూ ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించబడ్డారు. హెడ్లీ ఈ దాడులకు సూత్రధారి కాగా,రాణా అతనికి సహకరించినట్లు నేరారోపణలు ఉన్నాయి. దాడులకు ముందు రెక్కీ చేయడం, ప్రణాళిక రూపొందించడం వంటి ముఖ్యమైన అంశాల్లో రాణా కీలక పాత్ర పోషించినట్లు అనేక ఆధారాలు వెల్లడయ్యాయి. ఈ సంఘటనల అనంతరం 2009 అక్టోబర్‌లో ముందుగా హెడ్లీ, అనంతరం రాణా అమెరికాలో అరెస్టయ్యారు. హెడ్లీ కేసును విచారించిన అమెరికా కోర్టు అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అప్రూవర్‌గా మారిన హెడ్లీ, అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం చేసుకోవడంతో అతన్ని భారత్‌కు అప్పగించలేని పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

 తహవూర్ రాణాకు ఇల్లినాయిస్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష 

మరోవైపు, 2013లో తహవూర్ రాణాకు అమెరికాలోని ఇల్లినాయిస్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత, 2020లో భారత్ ప్రభుత్వం రాణాను తమకు అప్పగించాల్సిందిగా అమెరికాకు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా 2023లో ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి రాణా తన అప్పగింతను ఆపేందుకు అమెరికా కోర్టుల్లో అనేక రీతుల్లో ప్రయత్నించాడు. అయితే చివరికి, అమెరికా సుప్రీం కోర్టు వద్ద కూడా అతనికి ఊరట లభించకపోవడంతో, భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.