LOADING...
Trump: వైట్ హౌస్'లో అమెరికా టెక్ సీఈవోలకు ట్రంప్ విందు.. కనిపించని ఎలాన్ మస్క్ విందు
వైట్ హౌస్'లో అమెరికా టెక్ సీఈవోలకు ట్రంప్ విందు.. కనిపించని ఎలాన్ మస్క్ విందు

Trump: వైట్ హౌస్'లో అమెరికా టెక్ సీఈవోలకు ట్రంప్ విందు.. కనిపించని ఎలాన్ మస్క్ విందు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలు, నీళ్లు కలిసిపోయినట్లుగా 2024 అమెరికా ఎన్నికల సమయంలో కలిసి తిరిగారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మస్క్ తరచూ అయన పక్కనే కనిపించేవారు. ఓవల్ కార్యాలయంలో తన చిన్న కొడుకును భుజాలపై ఎక్కించుకుని ట్రంప్ పక్కన నిలబడ్డ మస్క్ ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఎప్పటికీ సన్నిహితంగా ఉంటారని భావించిన ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ, మస్క్ ట్రంప్‌పై బహిరంగ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో వారి మధ్య దూరం పెరిగి స్నేహం నెమ్మదిగా దెబ్బతింది.

వివరాలు 

విందుకు హాజరైన అమెరికాలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీల సీఈవోలు

ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, ఆ అనుబంధం పూర్తిగా తెగిపోయిందని స్పష్టమవుతోంది. గురువారం ట్రంప్ వైట్‌హౌస్‌లో టెక్ రంగ ప్రముఖులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అమెరికాలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీల సీఈవోలు దాదాపు అందరూ హాజరయ్యారు. అయితే ప్రపంచంలోని అతి పెద్ద ధనవంతుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం అక్కడ కనిపించలేదు. కొద్ది కాలం క్రితమే వైట్‌హౌస్‌కు తరచూ వెళ్లే మస్క్, ఈసారి దూరంగా ఉండటం గమనార్హం. దీనితో ట్రంప్-మస్క్ మధ్య ఉన్న స్నేహబంధం పూర్తిగా చెడిపోయిందని ఊహాగానాలు మొదలయ్యాయి. ట్రంప్ పక్కన బిల్ గేట్స్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు కనిపించారు.

వివరాలు 

ఏఐ వినియోగం,భవిష్యత్తు గురించి సూచనలు,సలహాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించినవారు సహా డజనుకు పైగా టెక్ నాయకులు ఈ విందులో పాల్గొన్నారని వైట్‌హౌస్ ప్రకటించింది. ముఖ్యంగా ఏఐ విధానంపై అక్కడ విస్తృతంగా చర్చ జరిగింది. ఈ విందు కోసం వైట్‌హౌస్‌లో పొడవైన టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక వైపున అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పక్కన బిల్ గేట్స్ కూర్చుకోగా, ట్రంప్ పక్కన జుకర్‌బర్గ్ కూర్చున్నారు. ఎదురుగా పిచాయ్, టిమ్ కుక్ ఉన్నారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశానికి మెలానియా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె ఏఐ వినియోగం, దాని భవిష్యత్తు గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. మొదట ఈ విందు రోజ్ గార్డెన్‌లో జరగాలని నిర్ణయించారు.

వివరాలు 

వైట్‌హౌస్‌లోని స్టేట్ డైనింగ్ రూమ్‌లో విందు 

దానికి అనుగుణంగా గార్డెన్‌లోని పచ్చికను సరిచేసి,టేబుళ్లు,కుర్చీలు,గొడుగులు ఏర్పాటు చేశారు. కానీ గురువారం మధ్యాహ్నం అనుకోకుండా వర్షం పడటంతో,ఈ కార్యక్రమాన్ని వైట్‌హౌస్‌లోని స్టేట్ డైనింగ్ రూమ్‌కు తరలించారు. ఈ విందు అతిథుల జాబితాలో గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్,మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్, ఒరాకిల్ సీఈఓ సఫ్రా కాట్జ్, బ్లూ ఆరిజిన్ సీఈఓ డేవిడ్ లింప్, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, టిఐబిసిఓ సాఫ్ట్‌వేర్ చైర్మన్ వివేక్ రణదివే, పలంటిర్ ఎగ్జిక్యూటివ్ శ్యామ్ శంకర్, స్కేల్ ఏఐ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్, షిఫ్ట్4 పేమెంట్స్ సీఈఓ జారెడ్ ఇసాక్‌మాన్ లు ఉన్నారని వైట్‌హౌస్ ధృవీకరించింది. ఇంత పెద్ద విందులో మస్క్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.