Page Loader
Reciprocal Tariffs: జపాన్,దక్షిణ కొరియాలపై 25% ప్రతీకార సుంకాలు.. చర్చలకు రావాలని మిగిలిన దేశాలకు సూచన
జపాన్,దక్షిణ కొరియాలపై 25% ప్రతీకార సుంకాలు.. చర్చలకు రావాలని మిగిలిన దేశాలకు సూచన

Reciprocal Tariffs: జపాన్,దక్షిణ కొరియాలపై 25% ప్రతీకార సుంకాలు.. చర్చలకు రావాలని మిగిలిన దేశాలకు సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా ఖండంలో అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వాములైన జపాన్‌, దక్షిణ కొరియా దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఈ రెండు దేశాల దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు సోమవారం అధికారికంగా లేఖల ద్వారా ప్రకటించారు. ఈ సుంకాలు వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. ఈ రెండు దేశాల నేతలకు ఉద్దేశించి ట్రంప్‌ రాసిన లేఖలను ఆయన తన సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్‌'లో పోస్టు చేశారు. జపాన్‌, దక్షిణ కొరియా సైతం తమ పక్షాన ప్రతీకారంగా సుంకాలు విధించవద్దని హెచ్చరిస్తూ, అలా చేస్తే వారి ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు.

వివరాలు 

ఒప్పందం కుదరని దేశాలకు సోమవారం నుంచి లేఖలు

"మీరు ఎలాంటి కారణాలతోనైనా కొత్త సుంకాలు విధిస్తే, మేము ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలపై అదనంగా మరిన్ని సుంకాలను అమలు చేస్తాం"అని స్పష్టం చేశారు. ఇతర దేశాలకు విధించిన ప్రతీకార సుంకాల గడువును కూడా ట్రంప్‌ ఆగస్టు 1 వరకు పొడిగించారు. సుంకాలపై ఉన్న ఉపశమనా గడువు బుధవారం నాటికి ముగియనున్న నేపథ్యంలో,ఆ గడువును ట్రంప్‌ సోమవారం మరింతగా పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సమయంలో ఆయా దేశాలు అమెరికాతో చర్చలకు రాగలిగితే ఒప్పందాల సాధనకు అవకాశం కలుగుతుందన్నది ఆయన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ఒప్పందం కుదరని దేశాలకు సోమవారం నుంచి లేఖలు పంపడం ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం,ఆగస్టు 1 నుంచి భారీగా సుంకాలు విధించనున్నట్లు కఠినంగా హెచ్చరించింది.

వివరాలు 

భారత్‌కు తాత్కాలిక ఊరట 

ఈ చర్యలతో భారత్‌కు మరికొంత గడువు లభించింది. బుధవారం నాటికి భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు సమాచారం. ఇదివరకు ఏప్రిల్‌ 2న ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాల నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అనేక దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు చెలరేగాయి. ప్రపంచ మార్కెట్లలో సంక్షోభం తలెత్తడంతో ట్రంప్‌ ఆ సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఈలోగా ఆయా దేశాలు ఒప్పందాల కోసం చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ఇప్పుడు ఆ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో, మరోసారి సుంకాల యుద్ధం తెరమీదకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.