Page Loader
Donald Trump:మస్క్ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే అమెరికాకు అన్యాయం: ట్రంప్ 
మస్క్ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే అమెరికాకు అన్యాయం: ట్రంప్

Donald Trump:మస్క్ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే అమెరికాకు అన్యాయం: ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ (ఎలెక్ట్రిక్ వెహికల్) కంపెనీ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ భారత్‌లో నియామకాలను ప్రారంభించింది. అంతేకాకుండా, షోరూమ్‌ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఫ్యాక్టరీ స్థాపించాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

మస్క్‌ పక్కన ఉండగానే ట్రంప్‌ అసంతృప్తి 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి ఫాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా టెస్లా భారత ఎంట్రీపై ట్రంప్ స్పందించారు. "ప్రపంచంలోని చాలా దేశాలు అమెరికాను ఉపయోగించుకోవాలనుకుంటున్నాయి. అధిక సుంకాల విధానంతో లాభపడాలని చూస్తున్నాయి. అందువల్లే మస్క్‌కు తన కార్లను విక్రయించడం కష్టంగా మారుతోంది. భారతదేశం కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మస్క్‌కి అది మంచిదైనా, అమెరికా దృష్టికొస్తే అది అన్యాయమైన నిర్ణయమే'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఏప్రిల్ నాటికి టెస్లా కార్యకలాపాలు ప్రారంభం? 

ట్రంప్ తన వ్యాఖ్యల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన భేటీని గుర్తు చేశారు. విద్యుత్ కార్లపై భారత ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాలను తాను మోదీ ముందు ప్రస్తావించానని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు, వాణిజ్య ఒప్పందాల కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయని ట్రంప్ వెల్లడించారు. గతంలో మోదీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆయనను కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ భేటీ తర్వాత కొద్ది రోజుల్లోనే టెస్లా భారత్‌లో నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలనాటికి టెస్లా విక్రయ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.అయితే, భారతదేశంలో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై టెస్లా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

వివరాలు 

భారత ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ 

ఇటీవల, భారత ప్రభుత్వం కొత్త ఈవీ విధానాన్ని (EV Policy) ప్రకటించింది. ఈ విధానం ప్రకారం.. కార్ల తయారీ సంస్థలు కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి దేశంలో ఫ్యాక్టరీని స్థాపిస్తే, దిగుమతి సుంకాలను 15%కి తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించడం, ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.