
Trump Tariffs: కెనడా దిగుమతులపై 35 శాతం టారీఫ్ విధించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధానంతో మళ్లీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా"మనకు చక్రవర్తులు అవసరం లేరు" అంటూ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ను తీవ్రంగా బాధించాయి. దీంతో ఆయన వెంటనే బ్రెజిల్‌పై ఉన్న సుంకాలను 10శాతం నుండి నేరుగా 50శాతం వరకు పెంచేశారు. ఈక్రమంలో ట్రంప్ తన పొరుగు దేశమైన కెనడాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా దిగుమతులపై 35 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా,ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కూడా 15శాతం నుంచి 20శాతం వరకూ టారీఫ్‌లు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈమార్పులు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు.
వివరాలు
22 దేశాలకు ట్రంప్ లేఖలు
ఈ చర్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీకి ట్రంప్ ఓ లేఖ రాశారు. అందులో కెనడా తమతో సహకరించే బదులు ప్రతీకార సుంకాలే విధిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. గత ఏప్రిల్ నుంచి వివిధ దేశాలపై విధించిన సుంకాలలో మార్పులు చేస్తూ వస్తున్న ట్రంప్,ఇటీవల జపాన్, దక్షిణ కొరియాలపై కూడా అదనపు టారీఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 22 దేశాలకు ట్రంప్ లేఖలు పంపారు. ఇంకా, బ్రిక్స్ సభ్య దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ఆయన ఇప్పటికే హెచ్చరించారు.
వివరాలు
భారత్‌పై 500 శాతం భారీ సుంకాలు
ఇక రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే, భారత్‌పై 500 శాతం భారీ సుంకాలు విధించాలని కూడా ట్రంప్ యోచిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఉక్రెయిన్‌కు మద్దతు తెలపకుండా రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో, భారత్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 500 శాతం టారీఫ్ విధించాలన్న బిల్లును ట్రంప్ రూపొందిస్తున్నారని సమాచారం.