
Gold Surge: ట్రంప్ సుంకాల దాడి.. బలహీనపడిన డాలర్.. గోల్డ్కు డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కొత్త వాణిజ్య సుంకాల దాడి, బలహీనమైన డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆందోళనలు కలిపి బంగారం ధరలను కొత్త ఎత్తులకు చేర్చాయి. ఆగస్టు 8న భారతీయ దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో ₹1,02,191 చేరింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు,కరెన్సీ మార్పులు,భద్రత కోసం పెట్టుబడులు పెట్టే ధోరణి..ఈ మూడు కలిసి బంగారాన్ని మరింత విలువైన పెట్టుబడి సాధనంగా మలిచాయి.
వివరాలు
ట్రంప్ సుంకాల దాడి
ఈ బంగారం ర్యాలీ వెనక ప్రధాన కారణం ట్రంప్ తిరిగి అవలంబించిన రక్షణాత్మక వాణిజ్య విధానాలు. భారత దిగుమతులపై 50% సుంకం,స్విట్జర్లాండ్ నుండి వచ్చే సరుకులపై 39% సుంకం విధించడం గ్లోబల్ వాణిజ్య మార్గాలను కుదిపేసింది. ఈ చర్యలు భారతదేశం రష్యా నుండి ఇంధన కొనుగోళ్లకు ప్రతిస్పందనగా తీసుకున్నవని వైట్ హౌస్ చెబుతోంది. ఈ నెల చివర్లో జరగబోయే ఆరో విడత వాణిజ్య చర్చలకు ముందే భారత్‌తో ఒప్పందం కష్టమవుతుందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. నిపుణుల అంచనా ప్రకారం,ఈ సుంకాల ప్రభావం వల్ల భారత ఆర్థిక వృద్ధి 0.3% నుండి 0.6% వరకు తగ్గే అవకాశం ఉంది. రూపాయి విలువ పడిపోవడంతో బంగారం రూపాయిల్లో మరింత ఖరీదైనదిగా మారి, దేశీయ ధరలను పెంచింది.
వివరాలు
బలహీనపడిన డాలర్, పెరిగిన బంగారం ధర
సుంకాల ఆందోళనలతో పాటు,అమెరికా డాలర్ విలువ పడిపోవడం కూడా బంగారం ర్యాలీకి తోడ్పడింది. డాలర్ విలువ 0.5% క్షీణించి 97.96కి పడిపోవడంతో, ఇతర కరెన్సీలలో బంగారం చవక అయ్యింది. దీంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు మరింతగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. డాలర్ బలహీనత, అమెరికా ఆర్థిక పరిస్థితులపై పెట్టుబడిదారుల అనుమానాలను ప్రతిబింబిస్తోంది. ఉద్యోగాల పెరుగుదల మందగించడం, సర్వీస్ రంగం నెమ్మదించడం వంటివి ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయంపై అనిశ్చితిని పెంచాయి.
వివరాలు
స్విస్ బంగారం ఎగుమతులకు దెబ్బ
అమెరికా కస్టమ్స్ & బోర్డర్ ప్రొటెక్షన్ నిర్ణయం ప్రకారం, కామెక్స్‌లో సాధారణంగా ట్రేడ్ అయ్యే ఒక కిలో, 100-ఔన్స్ బంగారు బార్లకు కూడా ఇప్పుడు దిగుమతి సుంకం వర్తిస్తుంది. గతంలో ఇవి సుంకం నుండి మినహాయింపు పొందేవి. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2025 జూన్ వరకు ఏడాదిలో స్విట్జర్లాండ్ అమెరికాకు $61 బిలియన్ విలువైన బంగారం ఎగుమతి చేసింది. కొత్తగా విధించిన 39% సుంకం కారణంగా అదనంగా $24 బిలియన్ భారం పడుతుంది. ఇది స్విస్ రిఫైనరీలపై పెద్ద ఒత్తిడిని సృష్టిస్తూ, గ్లోబల్ బులియన్ ట్రేడ్‌లో ప్రకంపనలు రేపుతోంది.
వివరాలు
ధరలు పెరిగినా భారత్‌లో క్షిణించిన డిమాండ్
ధరలు గగనానికి తాకినా, దేశీయంగా బంగారం వినియోగం తగ్గింది. ఢిల్లీలో ₹1,02,700, హైదరాబాద్‌లో ₹1,02,550కి చేరిన ధరలు వినియోగదారులను వెనక్కు నెడుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం, 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో బంగారం వినియోగం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 10% తగ్గి 149.7 టన్నుల నుండి 134.9 టన్నులకు పడిపోయింది. ముఖ్యంగా ఆభరణాల డిమాండ్ 17% క్షీణించడం, భారత వినియోగదారులు ధరలకు ఎంత సున్నితంగా స్పందిస్తారో చూపిస్తోంది.
వివరాలు
పెట్టుబడి డిమాండ్ పెరుగుదల
సంస్థాగత కొనుగోళ్లు బంగారం ర్యాలీకి మరొక మద్దతుగా నిలిచాయి. సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను పెంచుతుండగా, ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF) ఇన్‌ఫ్లోలు కూడా పెరిగాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం, సెప్టెంబరులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం.. ఈ రెండూ విలువైన లోహాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. చైనా పాత్ర..ఫెడ్ భవిష్యత్తు చైనా సెంట్రల్ బ్యాంక్ నిశ్శబ్దంగా బంగారం నిల్వలు పెంచడం,అంతర్జాతీయ అనిశ్చితి మధ్య కొంత స్థిరత్వాన్ని కలిగించింది. మరోవైపు, ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్‌గా మరింత సాఫ్ట్ పాలసీ వైపు మొగ్గు చూపే వ్యక్తిని ట్రంప్ నియమించవచ్చనే అంచనాలు కూడా పెట్టుబడిదారులలో ఊహాగానాలకు దారి తీశాయి.
వివరాలు
స్థిర పెట్టుబడి చిహ్నంగా బంగారం
వాణిజ్య యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక విధాన మార్పుల మధ్య బంగారం మళ్లీ స్థిర పెట్టుబడి చిహ్నంగా ఎదిగింది. ధరలు అధికంగా ఉండటంతో భారత్ వంటి మార్కెట్లలో సంప్రదాయ డిమాండ్ తగ్గినా, అనిశ్చితి నుండి రక్షణ కోసం పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఈ ర్యాలీ తాత్కాలికమా లేక దీర్ఘకాల బుల్ రన్ ప్రారంభమా అనేది రాబోయే రాజకీయ,ఆర్థిక పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం స్పష్టమే.. అస్థిర ప్రపంచంలో బంగారం ఆకర్షణ మాత్రం చెక్కుచెదరదు.