UNSC: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. భద్రతా మండలిలో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి 79వ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో స్టార్మర్ వ్యాఖ్యానించారు.
భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా,ఫ్రాన్స్ మద్దతు
"భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలని, అలాగే ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, అలాగే ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని భద్రతా మండలిలో తగిన ప్రాతినిధ్యం లేని స్థితిలో, ప్రపంచం ముందుకు సాగడం కష్టం. అందుకే భద్రతా మండలిని మరింత బలంగా నిర్మించాలి, శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచడం అవసరం" అని స్టార్మర్ పేర్కొన్నారు. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మద్దతు ప్రకటించారు.
నాలుగు దేశాలు భారత్‌కు మద్దతు
భద్రతా మండలి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఏర్పడి దాదాపు 75 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నారు. మిగతా దేశాలు తాత్కాలిక సభ్యులుగా రొటేషన్ పద్ధతిలో మారుతుంటాయి. భారత్ అనేక సంవత్సరాలుగా శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతుండగా, ఐదు శాశ్వత దేశాల్లో నాలుగు దేశాలు మాత్రం భారత్‌కు మద్దతు ఇస్తున్నాయి.