Page Loader
GTRI: డాలర్‌కు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న దేశాలు.. అమెరికా ఆర్థిక ఆంక్షలే కారణం: జీటీఆర్‌ఐ  
డాలర్‌కు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న దేశాలు.. అమెరికా ఆర్థిక ఆంక్షలే కారణం: జీటీఆర్‌ఐ

GTRI: డాలర్‌కు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న దేశాలు.. అమెరికా ఆర్థిక ఆంక్షలే కారణం: జీటీఆర్‌ఐ  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రతిపక్ష దేశాలను ఒత్తిడికి గురిచేయడానికి చేపడుతున్న ఆర్థిక ఆంక్షలే ప్రపంచ దేశాలను డాలర్‌ ఆధారిత వ్యవస్థల నుంచి దూరంగా నెట్టుతున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనీషియేటీవ్‌ (GTRI) అభిప్రాయపడింది. ముఖ్యంగా స్విఫ్ట్‌ అనే అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి రష్యా, ఇరాన్‌, వెనుజువెలా వంటి దేశాలను తొలగించడం వల్ల,ఆ దేశాలు డాలర్లలో లావాదేవీలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంస్థ వివరించింది. దీంతో భారత్‌, చైనా వంటి దేశాలు తమ స్వదేశీ కరెన్సీలతోనే వాణిజ్యాన్ని సాగిస్తున్నాయని పేర్కొంది. బ్రిక్స్‌ సభ్యదేశాలు డాలర్‌కు బదులుగా ఇతర కరెన్సీలతో ట్రేడింగ్‌ చేస్తుండటంపై ట్రంప్‌ 10 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించారని వెల్లడించింది.

వివరాలు 

భారత్‌ రూపాయులు, దిర్హామ్‌ల ద్వారా రష్యా చమురు కొంటోంది

అమెరికా ఒంటెద్దు ధోరణుల వల్లే ఈ స్థితి ఏర్పడిందని, కానీ ఆ విషయం అక్కడి పాలకులు అర్థం చేసుకోవడం లేదని జీటీఆర్‌ఐ శుక్రవారం పేర్కొంది. జీటీఆర్‌ఐలో ప్రముఖ విశ్లేషకుడు అజయ్‌ శ్రీవాస్తవ ఈ విషయాన్ని విశదీకరిస్తూ, ''ప్రస్తుతం డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి వెళ్లడం దేశాల తిరుగుబాటు కాదని, వాళ్లకు మిగిలిన ఏకైక మార్గమది. రష్యా-చైనా మధ్య వాణిజ్యంలో 90 శాతం రూబుల్‌ లేదా యువాన్‌ల్లోనే జరుగుతోంది. భారత్‌ రూపాయులు, దిర్హామ్‌ల ద్వారా రష్యా చమురు కొంటోంది. ఇంతటితో కాకుండా,పెట్రో డాలర్‌ ఒప్పందం ఉన్న సౌదీ అరేబియా కూడా డాలరేతర చమురు వ్యాపారానికి ముందుకు వచ్చిందని'' చెప్పారు. అమెరికా విధించిన ఆంక్షలే మొదట ఈ దేశాలను డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు ప్రేరేపించాయని తెలిపారు.

వివరాలు 

అమెరికా ఒత్తిడితో కొన్ని దేశాలపై నిషేధాలు

అంతేకాక, బ్రిక్స్‌ దేశాలపై 10 శాతం పన్నులు, రష్యా చమురు కొనుగోలుపై 500 శాతం టారిఫ్‌లు విధించే విధానాలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై మరింత సంక్లిష్టతను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోని సుమారు 11,000 బ్యాంకులను స్విఫ్ట్‌ వ్యవస్థ అనుసంధానిస్తుందని, ఇది సాధారణంగా తటస్థ వేదికగా కనిపించినప్పటికీ, అమెరికా ఒత్తిడితో కొన్ని దేశాలపై నిషేధాలు విధించబడినట్లు శ్రీవాస్తవ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుండి చమురు, వాయువు కొనుగోలు చేసే దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని చెల్లింపులు చేస్తున్నాయని తెలిపారు. ఇది అమెరికా వ్యతిరేక దృష్టికోణం కాదని,ప్రతిదేశం తన ఆర్థిక భద్రత కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటోందని అన్నారు.

వివరాలు 

డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలతో.. రూపాయిల్లో చెల్లింపుల సెటిల్మెంట్లను అనుమతిస్తూ ఆర్‌బీఐ చర్యలు

ఈ చర్యలకు ప్రేరణగా నిలుస్తున్నది మాత్రం అమెరికా విధించిన ఆంక్షలేనని స్పష్టం చేశారు. 2022లో, డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలతో రూపాయిల్లో చెల్లింపుల సెటిల్మెంట్లను అనుమతిస్తూ ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో రష్యా బ్యాంకులు చమురు చెల్లింపుల కోసం రూపీ ఖాతాలు కూడా ప్రారంభించాయి. మరోవైపు, బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను భారత్‌, చైనా తిరస్కరించాయని వెల్లడించారు. స్థానిక కరెన్సీల్లోనే వాణిజ్యం సాగిస్తే డాలర్‌ మార్పిడి ఖర్చులు తగ్గుతాయని, అలా చేస్తే కనీసం 4 శాతం వరకు వ్యయాన్ని ఆదా చేసుకోవచ్చని జీటీఆర్‌ఐ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రయోజనాన్ని అర్థం చేసుకున్న దేశాలు ప్రస్తుతం తమ కరెన్సీలతోనే లావాదేవీలు చేసుకుంటున్నాయని స్పష్టం చేసింది.