Page Loader
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా 

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసులో అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌' (TRF) అనే సంస్థను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్‌ఎఫ్‌ అనేది పాకిస్థాన్‌ ఆధారంగా పనిచేస్తున్న లష్కరే తయిబా ముసుగు సంస్థగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.

వివరాలు 

భారత భద్రతా బలగాలపై దాడులకు టీఆర్‌ఎఫ్‌ బాధ్యత

"మా జాతీయ భద్రత ప్రయోజనాలను కాపాడేందుకు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి, అలాగే పహల్గాం దాడికి న్యాయం చేయాలనే లక్ష్యంతో అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు తీసుకున్నారు. ఇది మా పరిపాలన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది" అని రూబియో పేర్కొన్నారు. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌'ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా గుర్తించడమే కాకుండా, ప్రత్యేకంగా గుర్తించిన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ (SDGT)గా కూడా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. 2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత భారత్‌లో జరిగిన దాడుల్లో పహల్గాం దాడి అత్యంత తీవ్రమైనదిగా అమెరికా ప్రభుత్వం గుర్తించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. భారత భద్రతా బలగాలపై గతంలో జరిగిన అనేక దాడులకు టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించినట్లు రూబియో స్పష్టం చేశారు.

వివరాలు 

భారత్‌ 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌పై భారీ ప్రతీకార దాడులు

గత ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ముష్కరులు పర్యాటకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పులు అందరికీ గుర్తున్నాయి. ఈ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడిని ముష్కరులు జరిపినట్లు వెల్లడైంది. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఖండించాయి. దాంతో పాటు భారత్‌ 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌పై భారీ ప్రతీకార దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది.