LOADING...
US Secretary: భారత్-పాకిస్తాన్ పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది: మార్కో రూబియో 

US Secretary: భారత్-పాకిస్తాన్ పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది: మార్కో రూబియో 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోదీస్పష్టం చేసినా, ఆ అభిప్రాయాన్ని అమెరికా మాత్రం తిరస్కరించింది. యుద్ధ పరిస్థితులను సద్దుమణిగించడంలో తానే కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చెబుతూ వస్తున్నారు. ఇక "యథా రాజా తథా ప్రజా" అన్నట్లుగా అమెరికా సెక్రటరీ మార్కో రూబియో కూడా ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. ఆదివారం ఎన్‌బీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ.. భారత్, పాక్‌ల పరిణామాలపై అమెరికా ప్రతిరోజూ సావధానంగా గమనిస్తోందని తెలిపారు.

వివరాలు 

భారత్, పాక్ ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రతిరోజూ పర్యవేక్షణ

"భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర స్పష్టంగా ఉంది. రెండు దేశాలు అణుయుద్ధం వైపు దూసుకెళ్లకుండా మేమే అడ్డుకున్నాం. దాడులు, ప్రతిదాడుల మధ్య ఇరుదేశాలను కట్టడి చేయడం మాకు చాలా క్లిష్టమైన పని అయింది. అందుకే భారత్, పాక్ ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రతిరోజూ పర్యవేక్షణ కొనసాగించాం" అని రూబియో వివరించారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ఆయన స్పందించారు. "వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇద్దరినీ చర్చల బాట పట్టించి కాల్పులు ఆగేలా చేయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, మా ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది" అని పేర్కొన్నారు.

వివరాలు 

 రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం 

"రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ త్వరలోనే జరగనుంది. దాదాపు మూడున్నర సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధం వలన ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. అందువల్ల ఇరుదేశాల నేతలు సీస్‌ఫైర్‌కు అంగీకరించక తప్పదు. అయితే మేము కోరుకునేది కేవలం కాల్పుల విరమణ మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదరాలి. ఆ ఒప్పందం కుదిరితే భవిష్యత్తులో మళ్లీ యుద్ధానికి దారి తీసే పరిస్థితి రాదు" అని రూబియో స్పష్టం చేశారు.

వివరాలు 

ఉగ్రదాడికి ప్రతిచర్యగా 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్‌'ను ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన క్షిపణులతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అంతేకాకుండా పాక్ సైనిక విమానాలు, డ్రోన్లను కూల్చి భారత్ పైచేయి సాధించింది. ఈ అప్రతీక్షిత దెబ్బతో పాక్ తీవ్రంగా ఆందోళన చెందింది. ఆవేశంతో తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం చేసింది. అయితే భారత సైన్యపు సాహసం, దైర్యం ముందు చివరికి వెనక్కి తగ్గి యుద్ధం ఆపాలని పాకిస్థాన్ మొరపెట్టుకుంది. దాంతో ఇరుదేశాల డీజీఎంవోలు చర్చలు జరిపి, మే 10న కాల్పుల విరమణ అమలు చేయాలని నిర్ణయించారు.