WHO: హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం.. దేశాలు అప్రమత్తంగా ఉండాలి: WHO
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎంవీ హోండియస్(MV Hondius) క్రూయిజ్ షిప్‌లో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచించారు. వైరస్ సోకిన ఫ్రాన్స్ మహిళ పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పారిస్ వైద్య అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఓ డచ్ దంపతులు, ఓ జర్మన్ పౌరుడు మృతి చెందగా.. మొత్తం తొమ్మిది మందికి ఆండీస్ వేరియంట్ హాంటావైరస్ నిర్ధారణ అయింది.
వివరాలు
రానున్న వారాల్లో మరిన్ని కేసులు బయటపడే అవకాశం
అర్జెంటీనా నుంచి కేప్ వెర్డే వెళ్తున్న ఎంవీ హోండియస్ నౌకలో ప్రయాణికుల మధ్య సన్నిహిత సంబంధాల కారణంగా వైరస్ వ్యాప్తి చెందిందని WHO తెలిపింది. సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. అరుదుగా మనుషుల మధ్య కూడా సోకే అవకాశం ఉందని పేర్కొంది. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉండటంతో రానున్న వారాల్లో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని టెడ్రోస్ చెప్పారు.
వివరాలు
స్పెయిన్ ప్రభుత్వం చర్యలను ప్రశంసించిన WHO
స్పెయిన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను WHO ప్రశంసించింది. కేప్ వెర్డే నౌకకు అనుమతి నిరాకరించడంతో స్పెయిన్‌లోని టెనెరిఫే పోర్టుకు అనుమతించి 120 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బందిని తరలించారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్(Pedro Sánchez) మానవత్వంతో స్పందించారని టెడ్రోస్ కొనియాడారు. ఇదే సమయంలో స్పెయిన్‌లో క్వారంటైన్‌లో ఉన్న 14 మంది స్పానిష్ పౌరుల్లో ఒకరికి కూడా హాంటావైరస్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు.
వివరాలు
వైరస్ మ్యూటేషన్‌పై ఇంకా పూర్తి స్పష్టత లేదు: ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ
ఇక బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సహా పలు దేశాలు తమ పౌరులను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాయి. బ్రిటన్‌కు చెందిన పలువురిని ఐసోలేషన్‌కు తరలించగా.. నెదర్లాండ్స్‌కు చేరిన ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైరస్ మ్యూటేషన్‌పై ఇంకా పూర్తి స్పష్టత లేదని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రోటర్‌డామ్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న ఎంవీ హోండియస్ నౌకలో వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.