No Income Tax: భారతదేశంలోని ఏకైక పన్ను రహిత రాష్ట్రం.. నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించకుండానే కోట్లు సంపాదిస్తారు
కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోతే, కొత్త పన్ను విధానంలో మాత్రం ముఖ్యమైన సంస్కరణలు అమలు చేస్తోంది. ఇటీవల స్టాండర్డ్ డిడక్షన్ పెంచడమే కాకుండా పన్ను శ్లాబులను సవరించి, మరింత సులభతరం చేసింది. ఈ మార్పులతో మధ్యతరగతి, మధ్య ఆదాయ వర్గానికి ఉపశమనం లభించింది. అయితే, పాత పన్ను విధానాన్ని ముట్టుకోకపోవడం, దాన్ని రద్దు చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. భారతదేశంలో నిర్దిష్ట పరిమితిని మించి సంపాదించే వ్యక్తులు ఆదాయంపై ఇన్‌కం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను శ్లాబుల ఆధారంగా ఎంత ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలో నిర్ణయించబడుతుంది. పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు పొందడానికి కొన్ని టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపయోగించుకోవచ్చు.
టాక్స్ లేని ప్రాంతాలు
ప్రపంచంలో అత్యంత ధనిక నగరాల్లో ఒకటైన దుబాయ్‌లో టాక్స్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అలానే భారతదేశంలో కూడా టాక్స్ లేని రాష్ట్రం ఉంది, అది సిక్కిం. సిక్కిం ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఇన్‌కం టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం భారతదేశంలో అత్యంత తక్కువ జనాభా కలిగి ఉండి, 1975లో ఒక ప్రత్యేక రెఫరెండం ద్వారా భారత్‌లో విలీనం అయింది. ఈ విలీన సమయంలో సిక్కిం రాజు ఒక ప్రత్యేక షరతు పెట్టారు, అదే వారు 1975కు ముందే అనుసరిస్తున్న పన్ను చట్టాలు కొనసాగించాలన్నది.
ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
సిక్కిం తన స్వంత పన్ను చట్టం-1948 ప్రకారం కేంద్రానికి పన్ను చెల్లించకూడదని నిర్ణయించుకుంది. 2008లో కేంద్రం ఈ చట్టాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 371(f) ప్రవేశపెట్టింది. సెక్షన్ 10(26AAA) ద్వారా సిక్కిం ప్రజల 94% మందికి పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు కల్పించింది. సిక్కిం తో పాటు త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే షెడ్యూల్ తెగల ప్రజలకు కూడా పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 10(26) ప్రకారం, ఈ ప్రత్యేక హోదా అమలవుతుంది.